ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరో ముందడుగు
అమరావతి : వెనుకబడిన బీసీ సామాజిక వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. ఈ మేరకు బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, బీసీ మంత్రులు, ఆ సామాజిక వర్గాల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం శనివారం సమీక్ష చేపట్టారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీల సమస్యలపై జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చలు, పరిశీలన అనంతరం కమిటీ నివేదినకు సమర్పించింది. దీంతో నేటి సమీక్షలో నివేదిక, అందులోని అంశాలపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. 10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరిగా, లక్ష నుంచి 10 లక్షల వరకు ఉన్న బీసీ వర్గాల వారిని రెండో కేటగిరిగా, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరిగా విభజించి.. ఆ మేరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ల ద్వారా విస్తృత చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పదివేల లోపు ఉన్న సంచారజాతులు, గుర్తింపునకు నోచుకోని వర్గాల వారికి సరైన గుర్తింపునిచ్చి.. వారు కూడా సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాల్సిన చర్యలపై సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు.
గృహనిర్మాణం, పెన్షన్లు, రేషన్ కార్డులు, కులవృత్తులు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలన్న దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగాలని, అవసరమైన మరోసారి విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ, బీసీ వర్గాల ప్రతినిధులు పొల్గొన్నారు.
Post Comment