అర్హులందరికీ ఇళ్ల స్థలాలు- మంత్రి బొత్స సత్యనారాయణ

సచివాలయం: అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష జరిపారని, సమావేశంలో పలు అంశాలపై చర్చించారన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపినీ, గృహ నిర్మాణం, అదే విధంగా స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం వంటి అంశాలపై చర్చించామన్నారు. సుమారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 20 లక్షల మంది వరకు అర్హులుగా గుర్తించాం. ఇది కాకుండా ఇంకా వలంటీర్లతో సర్వే కూడా చేయిస్తున్నామన్నారు. అర్హులందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.

పారదర్శకంగా అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారన్నారు. గత ప్రభుత్వం పట్టణాల్లో ఇళ్లు నిర్మిస్తే జీ ప్లస్‌ 3 కట్టి ఒక ప్లాటు ఇచ్చేవారని, అలా కాకుండా ఒకొక్కరికి ఒక ప్రత్యేక గృహాన్ని (ఇండిపెండెంట్‌ హౌస్‌) ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏ విధంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారో.. ఆ రకంగా సైట్, బిల్డింగ్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాలను కేటాయించి ఇళ్లులు కూడా మంజూరు చేయించి ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 2500 ఎకరాల భూములను గుర్తించామని, పంపిణీకి 11 వేల ఎకరాలు ఇవ్వాల్సి ఉందన్నారు.

ఉగాది పండుగ నాటికి ఇళ్ల స్థలాల పంపిణీకి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని మంత్రి బొత్స చెప్పారు. ప్రభుత్వ భూమి లేని చోట భూమి కొనుగోలు చేసి నిరుపేదలకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో సుమారు రూ.10 నుంచి రూ.12 వేల కోట్లు అవసరం అని భావించామన్నారు. అంతేకాకుండా ఇంతకు ముందు కట్టిన ఇళ్ల పరిస్థితులను పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మతులు చేయించాలని సీఎం ఆదేశించారన్నారు.
గత ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇంకా సగానికిపైగా పునాదుల దశలోనే ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నిధులతో నిర్మాణాలను పూర్తిచేస్తామని, వైయస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకానికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను జతచేస్తామన్నారు. ఇళ్ల స్థలాలను లబ్ధిదారుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తామన్నారు.

print

Post Comment

You May Have Missed