శ్రీశైల దేవస్థానం అభివృద్ధి పనులపై దేవస్థానం ఈ ఓ సమీక్ష జరిపి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల నాలుగో తేదీన ఈ ఓ వివిధ విభాగాల అధికారులతో , పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ , గోశాల రక్షణ , పారిశుధ్య పనులు, యాత్రికులకు సౌకర్యాలు, ఇంజినీరింగ్ పనులు, పరిపాలన, అకౌంట్స్ , రెవిన్యూ ,వసతి , అన్నదానం, శ్రీశైల ప్రభ, సాంస్కృతిక కార్యక్రమాలు , హిందూ ధర్మ ప్రచారం తదితర అంశాలు సమీక్షించారు.
క్యూ కాంప్లెక్స్ లో ఫ్యాన్లు పెంచి , కూలర్స్ ఏర్పాటుకు ఇంజినీరింగ్ అధికారులను ఈ ఓ ఆదేశించారు. గోశాల లో గోవుల సంరక్షణకు సకల చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి గోవుపై శ్రద్ధ చూపాలని ఈ ఓ ఆదేశించారు.సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు అవసరమని సూచించారు. గోవులు విష పురుగుల బారిన పడకుండా రక్షణ చర్యలు అవసరమని ఆదేశించారు.గౌరీ గణేశ్ గోశాలలో మరిన్ని షెడ్లు నిర్మించాలని, ఇందుకు వెంటనే టెండర్లు పిలవాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. వర్షా కాలం వస్తున్నందున అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య , వైద్య విభాగాలను ఆదేశించారు.క్షేత్ర పరిధిలో తరచు ఫాగింగ్ చేయాలని అన్నారు.స్థానికులకు , యాత్రికులకు తగిన వైద్యానికి వీలుగా వైద్య శాలలో మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్య విభాగాన్ని ఆదేశించారు.