శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏ కార్యక్రమమైనా పట్టుదలగా చేసి విజయాలు సాధించాలని శ్రీ చిన జీయర్ స్వామి వారు తరచూ పిలుపు ఇస్తుంటారు. పూర్వాచార్యుల నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే అంటారు శ్రీ స్వామి వారు. వారి ఆశయాలకు అనుగుణంగా తమ ప్రతిభ చాటుతోంది శ్రీమతి సముద్రాల మాధవీ, రామానుజం మిషన్.
శ్రీ జీయర్ స్వామివారి దివ్య మంగళాశాసనములతో “ఆచార్య త్రయము” అనే నృత్య రూపకమును శ్రీమతి సముద్రాల మాధవి రామానుజం రూపొందించారు.
భరతనాట్య సాంప్రదాయ శైలిలో ప్రదర్శింపబడే ఈ నృత్యరూపకం మువ్వురు ఆచార్యుల గురించి వివరిస్తుంది. శ్రీ భగవద్ రామానుజులు, శ్రీ మణవాళ మహామునులు, శ్రీ పెద్దజీయర్ స్వామివారి జీవిత విశేషాలు కలబోసి రూపొందించిన నృత్యరూపకం ఆచార్యత్రయము.
జీయర్ స్వామివారి ఆదేశంతో ఈ నృత్యరూపకాన్ని 108 మార్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించారు శ్రీమతి సముద్రాల మాధవీ రామానుజం.ఇది ఒక రికార్డు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ రికార్డును రిజిస్టర్ చేసారు.
గత సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన “ఆచార్యత్రయము – 108 ప్రదర్శనల ప్రస్థానం” పుస్తకావిష్కరణ చేస్తూ శ్రీ జీయర్ స్వామివారు ” 120 ప్రదర్శనలు” అని అన్నారు.బహుశ శ్రీ భగవద్ రామానుజుల జీవిత కాలమును సూచిస్తూ అన్నారేమో అని భావించి ప్రదర్శనలు కొనసాగించారు శ్రీమతి మాధవీ రామానుజం.
116వ ప్రదర్శన: శ్రీ వైష్ణవ సేవా సంఘం ,తెలంగాణ ,ఎస్ వి ఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లలితకళా తోరణం లో జరిగిన శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగం , డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో “ఆచార్య త్రయము” 116వ ప్రదర్శన జరిగింది . టెక్కలిలొ 117 వ ప్రదర్శన, శ్రీకూర్మంలో 118, మందసలో 119 వ ప్రదర్శన కు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ స్వామివారి ఆశీస్సులతో 120 వ ప్రదర్శన శ్రీరంగంలో చేయాలని సంకల్పం చేసారు నిర్వాహకులు .
నాగోలులో శ్రీమతి మాధవీ రామానుజం నిర్మించిన నాట్య ఆచార్య నిలయమును శ్రీ స్వామివారు గత ఫిబ్రవరి 17 వ తేదీ నఆవిష్కరించారు. ఆ సందర్భంగా శ్రీ స్వామివారు ఇచ్చిన సూచన మేరకు ఒక క్రొత్త నృత్యరూపకం చేస్తున్నారు వీరు.
శ్రీ భగవద్ రామానుజుల విద్యార్థి జీవనం ఇతివృత్తం. శ్రీ స్వామివారు కరుణించి నామకరణం చేసారు . “ఆదర్శ విద్యార్థి – రామానుజ”. ఎక్కువగా స్కూల్స్, కళాశాలలలో ఈ నృత్యరూపకం ప్రదర్శించి భావి భారత పౌరులకు శ్రీ రామానుజ స్ఫూర్తి అందించాలన్నది వీరి సంకల్పం. ఆచార్యత్రయము 116 వ ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన శ్రీ వైష్ణవ సేవా సంఘము వారికి శ్రీమతి మాధవీ రామానుజం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.”ఆచార్య త్రయము” నృత్య దర్శకులు శ్రీమతి సముద్రాల మాధవీ రామానుజం.రచన: శ్రీమాన్ సముద్రాల రామానుజం కాగా సంగీతం, గానం శ్రీమాన్ వడలి ఫణినారాయణ అందించారు.
ఆచార్య త్రయం నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. వీక్షకులను అలరించింది. ఈ సందర్బంగా శ్రీ స్వామి వారు అనేక మంగళాశాసనాలు చేసారు. శ్రీమతి మాధవీ రామానుజం మరిన్ని విజయాలు అందుకోవాలని వీక్షకులు ఆకాక్షించారు.