అంతర్రాష్ట్ర వివాదాల నడుమ నాలుగు దశాబ్ధాలుగా నలుగుతున్న మూడు ప్రాజెక్టులకు ఒకే రోజు ఒప్పందం జరగడం చారిత్రాత్మకమని ఇరిగేషన్ మంత్రి టి. హరీష్ రావు వ్యాఖ్యనించారు. ఇది ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు రచించిన మరోచరిత్ర అని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఇలాంటి చారిత్రక ఘట్టంలో తాను కూడా భాగస్వామి అయినందుకు తన జన్మ ధన్యమైందన్నారు. ముంబయిలో జరిగిన ఒప్పందం వల్ల ఉత్తర తెలంగాణ తాగు, సాగు నీటి సమస్య తొలగిపోతుందని, మరోవైపు మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాల అవసరాలకు సాగునీరందుతుందని మంత్రి చెప్పారు. చనాకా కోరటా, తుమ్మడి హెట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులు పూర్తయితే రెండు రాష్ట్రాల లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, నౌకాయానానికి సైతం అవకాశాలు మెరుగు పడతాయని మంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై ఒప్పందం ఫలించడానికి సహకరించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆ రాష్ట్ర మంత్రులు గిరీష్ మహాజన్, విజయ శివతారె, మునగం తివార్, అంబరీష్ రావు ఆత్రం తదితరులందరికి, రెండు రాష్ట్రాల సాగునీటి రంగ ఇంజనీర్లు, అధికార్లు, ఇతర యంత్రాంగానికి మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను నివారించడానికి, ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణానికి గాను ప్రాజెక్టులను రీ-ఇంజనీరింగ్ రూపొందించిన విజనరీ సీఎం కెసిఆర్ కు మంత్రి హరీష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.