ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఈ నెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి 30 రోజుల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కె. కేశవరావు, ఎస్. నిరంజన్ రెడ్డి (టిఆర్ఎస్), మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ (కాంగ్రెస్), పాషా ఖాద్రి, జాఫ్రి (ఎంఐఎం), రాంచందర్ రావు, మల్లారెడ్డి (బిజెపి), ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి (టిడిపి), తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి (సిపిఎం), చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి (సిపిఐ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రజల మధ్యకు వెళ్లిన తర్వాత విస్తృత చర్చ జరుగుతుందని, ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయం మేరకు మార్పులు చేర్పులు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వచ్చిన అభిప్రాయాలపై మరోసారి చర్చించడానికి 15 రోజుల తర్వాత ఒకసారి, 30 రోజుల తర్వాత మరోసారి అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని సిఎం చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు ఉందని, 683 జిల్లాల్లో ఒక్కో జిల్లా సగటు జనాభా 18 లక్షలుందని సిఎం చెప్పారు. కానీ తెలంగాణలో 3.6 కోట్ల జనాభా ఉంటే పది జిల్లాలున్నాయని, ఒక్కో జిల్లాలో సగటున 36 లక్షల మంది ఉన్నారని వివరించారు. జాతీయ సగటుకున్నా తెలంగాణ సగటు రెట్టింపు ఉందన్నారు. విస్తీర్ణంలో కూడా జాతీయ జిల్లా సగటు 4వేల కిలోమీటర్లుంటే, తెలంగాణ జిల్లాల సగటు విస్తీర్ణం 11వేల కిలోమీటర్లుందని వెల్లడించారు. చాలా జిల్లాల్లో మండలాలు, గ్రామాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి, ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి, పరిపాలనా సౌలభ్యానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
స్వాగతించిన రాజకీయ పక్షాలు
—————————-
తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు సౌకర్యంగా ఉండడం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయపక్షాలు స్వాగతించాయి. ప్రభుత్వ ప్రతిపాదనలను దాదాపు ఆమోదించారు. డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు కొన్ని సూచనలు చేయగా, వాటిని పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.