న్యూయార్క్, సెప్టెంబర్ 26 : ప్రపంచ యవనికపై నవ్యాంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర లిఖించింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాల గురించి ప్రపంచ ఆర్ధిక వేదిక(WEF) తొలిసారి శ్వేతపత్రాన్ని రూపొందించింది. ‘సుస్థిర ఉత్పాదకత సత్వర సాధన’ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి(APEDB)తో కలిసి ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సంయుక్త పత్రాన్ని విడుదల చేసింది. ఈ పత్రంలో ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక సానుకూల అంశాలపై 28 పేజీలలో స్పష్టంగా వివరించారు.
ఆటోమోటీవ్, ఎలక్ర్టానిక్ పరిశ్రమలకు సంబంధించి 2022 నాటికి ఏటా 5 యుఎస్ బిలియన్ డాలర్ల మేర అవకాశాలు వున్నాయని తొలిపేజీలో WEF ప్రముఖంగా పేర్కొంది. ఇప్పటికే త్రీడీ ముద్రణ, బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషియల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికతలో ముందంజలో వుంచడమే కాకుండా నిపుణులైన మానవ వనరుల కేంద్రంగానూ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతోందని ప్రభుత్వం కృషిని వెల్లడించింది. రెండంకెల వృద్ధి నమోదు కావడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటిస్థానం దక్కడాన్ని ప్రస్తావించింది. 12 రంగాలపై ప్రముఖంగా దృష్టి పెట్టినట్టి, వీటి అభివృద్ధికి ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను అనుసరిస్తున్నట్టు తెలిపింది.
మొత్తం నాలుగు చాప్టర్లుగా వెలువరించిన ఈ పత్రంలోని తొలి ఛాప్టర్ ‘భారతదేశంలో పారిశ్రామిక ముఖచిత్రం’, రెండో ఛాప్టర్ ‘సుస్థిర ఉత్పాదకతను పెంపొందించడానికి దోహదపడే నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికత’ మూడవ ఛాప్టర్ ‘సుస్థిర ఉత్పాదకత విలువ’, నాలుగో ఛాప్టర్లో ‘సుస్థిర ఉత్పాదకతకు మార్గం’ శీర్షికలతో వివరణాత్మక అంశాలు నిక్షిప్తం చేశారు.
ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురము జిల్లాలు ఆటో హబ్‌గా రూపొందుతున్నాయని, అనంతపురము జిల్లాలో కియా మోటార్స్, వీరవాహన బస్ బిల్డింగ్, చిత్తూరులో ఇసుజు, హీరో మోటో కార్ప్, అమరరాజా గ్రూప్, అపోలో టైర్స్, ఆటో కాంపొనెంట్ తయారీ యూనిట్లు, నెల్లూరులో భారత్ ఫోర్జ్, కృష్ణా జిల్లాలో అశోక్ లేల్యాండ్ వంటి ఆటో మొబైల్ రంగ దిగ్గజాలు వేళ్లూనుకున్న వైనాన్ని సంయుక్త పత్రంలో తెలియజేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి-వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను, హైపర్ లూప్ వంటి సరికొత్త ప్రజా రవాణా విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు చేస్తున్న యోచనను ఇందులో గుర్తుచేశారు. శ్రీసిటీ, తిరుపతి, కాకినాడ, విశాఖ, అనంతపురము, అమరావతిలలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లష్టర్ల అభివృద్ధి ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్టు సంయుక్తపత్రంలో తెలిపారు.
సంయుక్తపత్రంలో ముఖ్యాంశాలు :
1) ఎలక్ట్రానిక్స్ రంగం :
దేశంలో ఉత్పత్తి చేసే ప్రతి 50 మొబైల్ ఫోన్లలో 2020 నాటికి ఏపీలో 10 నుంచి 15 తయారుకావాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం.
ఎలక్ట్రానిక్ రంగంలో 2020 నాటికి నాలుగు లక్షల మందికి ఉద్యోగాల కల్పన.
సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయాల ఏర్పాటు.
యూనివర్సిటీలు, వివిధ సంస్థల ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.
అమరావతిలో ఎలక్ట్రానిక్స్ సిటీ నిర్మాణం.
2) ఆటోమోటివ్ రంగం :
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకానుంది.
మనుషులకు సహకరించే రోబోల పరిజ్ఞానం విస్తరణకు ‘కోబోటిక్స్ 2.0’ విధానం.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా బయో ఆధారిత ప్లాస్టిక్, మిశ్రమాల వినియోగం ద్వారా ఆటోమొబైల్ రంగంలో విడిభాగాల తయారీ.
మెటల్ త్రీడీ ప్రింటింగ్ వినియోగాన్ని ప్రోత్సహించడం.
3) సాంకేతిక రంగం :
మెటీరియల్ వినియోగం తగ్గించేందుకు త్రీడీ ప్రింటింగ్, నకిలీ ఫోన్లను అరికట్టేందుకు డిజిటల్ ట్రేసబిలిటీ, నీటి పరిరక్షణకు అత్యాధునిక EDA, ప్రమాదాల నివారణకు కోబోటిక్స్ 2.0, కాలుష్య నియంత్రణకు ‘బయో ఆధారిత ప్లాస్టిక్’ వినియోగానికి ప్రోత్సాహం.
నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన సాంకేతిక అంశాలతో అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధంజేసిందని సంయుక్త పత్రం పేర్కొంది. దీనిని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ హెలెనా లారెంట్, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్ తొలిపలుకు అందించారు.
అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్, ఇంకా పలువురు అధికారులు ఉన్నారు.