నేను కూలీ నెంబర్ వన్
అందరం శ్రమిస్తేనే అత్యుత్తమ ఫలితాలు,
ఉపాధ్యాయులకే మానవ వనరుల అభివృద్ధి బాధ్యత
గురుపూజోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
మంగళగిరి, సెప్టెంబర్ 5 : ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం విద్యార్ధులకు వుందని, ఆ దిశగా వారిని నడిపించే దిక్సూచిలా ఉపాధ్యాయులు వుండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్రాన్ని మేలైన మానవ వనరులకు గమ్యస్థానంగా మలచాలని, ఈ బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరారు. మానవ వనరుల అభివృద్ధికే బడ్జెట్లో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బుధవారం మంగళగిరిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఎదగడం ఆయన పట్టుదలకు నిదర్శనమని గుర్తుచేశారు. అదే పట్టుదల, స్ఫూర్తి ఇప్పుడు అందరికీ కావాలన్నారు. రాధాకృష్ణన్ వంటి వ్యక్తి తెలుగు గడ్డపై పెరగడం మనకు గర్వకారణమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. తాను రాష్ట్రంలో నెంబర్‌వన్ కూలీలా కష్టపడుతున్నానని, అందరం అదేస్థాయిలో శ్రమిస్తే అత్యుతమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.తనను జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసింది గురువులేనని, తనకు వారిపై అంచంచల విశ్వాసం, నమ్మకం వుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. సమాజంలో సమస్యలకు పరిష్కారం చూపేదిగా చదువు వుండాలని ఆకాంక్ష వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒత్తిడి నడుమ విద్యను అభ్యసించే పరిస్థితి వుండకూడదని, ఆహ్లాదంగా-ఆనందంగా విద్యను ఆర్జించేలా చూడాలని చెప్పారు. ఉపాధ్యాయులు 24 గంటలు తరగతి గదుల్లోనే గడపకుండా ప్రకృతిని ప్రేమిస్తూ సేద తీరాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు నరేగా నిధులతో ప్రహరీ గోడలు నిర్మించడంతో సహా 2022 నాటికి అన్ని జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు సిద్ధం చేయాలని సంకల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు ప్రారంభిస్తున్నామని, అలాగే ఉపాధ్యాయుల నియామకాలు చేపడతామని చెప్పారు. డ్రాప్ అవుట్స్ భారీగా తగ్గించగలగడం, 2014కు ముందు విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రాన్ని ప్రస్తుతం దేశంలోనే 3వ ర్యాంకులో నిలబెట్టడం ప్రభుత్వ విజయాలుగా పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్దఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, హైస్కూళ్లు కూడా సరిపడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 కి పైగా ఇంజినీరింగ్ కాలేజీలు నెలకొల్పేలా చూసామని ముఖ్యమంత్రి వివరించారు. అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు తరలి వస్తున్నాయని, దేశంలో ఏ రాష్ట్ర రాజధానిలోనూ ఇన్ని విద్యాసంస్థలు లేవన్నారు.
నిత్య విద్యార్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు : గంటా
విద్య, విజ్ఞానం అంటే ఎంతో ఆసక్తి చూపే ముఖ్యమంత్రి గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా విద్యాభివృద్ధికి రూ. 25 వేల కోట్లు ఖర్చు పెట్టారని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎంతో జ్ఞానం వున్నా కొత్త విషయాలు నేర్చుకునేందుకు ముఖ్యమంత్రి నిత్య విద్యార్ధిలా ముందుంటారని చెప్పారు.
కార్యక్రమంలో ముందుగా జ్యోతిని వెలిగించి, సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి సభను ప్రారంభించిన ముఖ్యమంత్రి, చివరిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పురస్కారాలు ప్రదానం చేశారు.
పీవీ సింధుకు సత్కారం
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకకు హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సభా వేదిక ముఖ్యమంత్రి గౌరవించి, సత్కరించారు. దేశం గర్వించదగిన క్రీడాకారిణి పీవీ సింధూ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా వుందని, ఆంధ్రప్రదేశ్‌కు ఖ్యాతిని, గౌరవాన్ని తీసుకువచ్చారని చెప్పారు. కామన్వల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్ షిప్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన సింధుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. తాను మరిన్ని పతకాలు గెలుపొందాలని, ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించాలని అన్నారు. పీవీ సింధు 23 ఏళ్ల వయసులోనే ఇన్ని విజయాలు సాధించడం వెనుక ఆమె ఎంతో కఠోరంగా శ్రమించారని చెప్పారు. సింధులా ఎందరినో తయారుచేయాలని ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి కోరారు. తన తల్లిదండ్రులు తనకు మొదటి ఉపాధ్యాయులని, తనను ఈస్థానంలో గురువులే నిలిపారని సింధు అన్నారు. రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తెస్తానని, మీ అందరి ఆశీస్సులు కావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు
Post Comment