తెలంగాణా పాత్రికేయుల సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ తో టీయుడబ్ల్యుజె((ఐజేయు) మంగళవారం ఢిల్లీలో ధర్నా నిర్వహించింది . జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణా పాత్రికేయుల సమస్యలను పాలకులు పట్టించుకోవడంలేదని , అందుకే ఢిల్లీలో తమ ఘోష వెల్లడిస్తున్నామని చెప్పారు . గత నాలుగు ఏళ్ళలో అనేకమంది పాత్రికేయులు అసహజ మరణం పొందారన్నారు . తమ రాష్ట్రంలో జర్నలిస్టులకు తగిన వేతనాలు లేవని , ఇండ్లు , స్థలాల సమస్య పరిష్కారం కాలేదని ,విశ్రాంత పాత్రికేయులకు పెన్షన్ సౌకర్యం లేదని , ఆరోగ్య భద్రతకు పూర్తి భరోసా లేదని అన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తగిన ఏక మొత్తం పరిహారం లేదని , తగిన , దీర్ఘకాలిక నెలవారీ పెన్షన్ సౌకర్యం లేదని ధర్నాకు వచ్చిన వారు ఆందోళన చెందారు. పాత్రికేయుల పిల్లలకు ఉచిత విద్య సౌకర్యం కల్పించాలని , జర్నలిస్టుల సమస్యలన్నీ తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేసారు. వామపక్ష జాతీయ నాయకులు ధర్నాకు మద్దతు ప్రకటించారు.