Meeting on implementation of Mid Day Meals to College Students in TS Under Chairmanship of Dy.CM (Education)Kadiyam Srihari with Ministers Eatala Rajender, T. Harish Rao, A.Indrakaran Reddy, Jogu Ramanna in Secretariat today.
అన్ని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం* ఉప ముఖ్యమంత్రి కడియం నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన మంత్రుల కమిటీ*విద్యార్థులకు అందించే భోజనాన్ని రుచిచూసిన మంత్రులు*విద్యార్థులకు పోషక విలువలు కలిగిన భోజనం అందించాలని నిర్ణయం*మధ్యాహ్న భోజనం నివేదిక అందించాలని అక్షయపాత్ర ఫౌండేషన్ ను కోరిన కమిటీ
హైదరాబాద్, ఆగస్టు 03 : డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ, వృత్తివిద్య కాలేజీల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ రోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్నలు సచివాలయంలో రెండోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ, బి.ఈడీ, డి.ఈడీ, మోడల్ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం అందించేందుకు కావల్సిన మౌలిక వసతులు సమకూర్చుకోవాలని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు మంత్రుల కమిటీ సూచించింది. అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు అందించే భోజనాన్ని నేడు సచివాలయంలో మంత్రులందరూ రుచి చూశారు. అక్షయపాత్ర ఫౌండేషన్ విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని మంత్రులు, అధికారులు భోజనంగా చేశారు.
అక్షయపాత్ర ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా అన్నపూర్ణ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పథకం నడిపిస్తున్నామని అక్షయపాత్ర ఫౌండేషన్ పబ్లిక్ రిలేషన్ ఇన్ ఛార్జీ రవిలోచన్ దాస్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కంది,నార్సింగి, కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్ లలో కిచెన్లు ఉన్నాయని, మరో ఆరు కిచెన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలు కలిగిన భోజనం అందించేందుకు మెను, వాటి ధరల నివేదికను ఈ నెల 6వ తేదీన అందించాలని మంత్రుల కమిటీ అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులను కోరింది. ఈ నివేదికను సిఎం కేసిఆర్ కు సమర్పించిన తర్వాత ఆయన నిర్ణయం ప్రకటిస్తారని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం కాలేజీ విద్యార్థులకు ప్రారంభించే ముందు ట్రయల్ రన్ చేయాలని సూచించింది. మంత్రుల కమిటీ సూచనకు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు అంగీకరించారు. వీలైనంత త్వరలో కిచెన్లు కూడా ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనం అందించడంపై మూడు, నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, మోడల్ జూనియర్ కాలేజీల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.