నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మిషన్ భగీరథ ముందున్నదన్నారు కేంద్ర తాగునీరు, పారిశుద్ధ శాఖ సహాయ కార్యదర్శి ఆసిఫ్ .కే. యూసుఫ్ (IAS). మిషన్ భగీరథ వెబ్ సైట్, మొబైల్ యాప్ తో ప్రాజెక్టు పనులను రియల్ టైమ్ మానిటరింగ్ చేయడం గొప్ప విషయం అన్నారు. ఎర్రమంజిల్ లోని RWS&S కార్యాలయంలో ఇవాళ ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డితో ఆసిఫ్ సమావేశం అయ్యారు. మిషన్ భగీరథ లో ఉపయోగిస్తున్న సాంకేతికతను స్వజల్ స్కీంలో అమలుచేసే సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందుకు కేంద్ర తాగునీరు,పారిశుద్ధ్య శాఖ సహాయ కార్యదర్శి అసిఫ్ ఈ రోజు ఈ.ఎన్.సి తో సమావేశమయ్యారు. మిషన్ భగీరథ లక్ష్యం, స్వరూపంపై ఈ.ఎన్.సి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ భౌగోళిక స్వరూపంపై ఆసిఫ్ కు అవగాహన కల్పించారు. రెండు నదుల మధ్య ఉన్నా కూడా ఇన్ని రోజులు తెలంగాణ గొంతు ఎందుకు ఎండిపోయిందో వివరించారు. మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల దూప తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పడుతున్న తాపత్రయానికి అనుగుణంగా జరుగుతున్న పనుల పురోగతిని ఫోటోల రూపంలో చూపించారు. ఆ తర్వాత మిషన్ భగీరథ వెబ్ సైట్, మొబైల్ యాప్ తయారీ, పనితీరును డీఈ ప్రశాంత్ వివరించారు. డ్యాష్ బోర్డ్ సహాయంతో పనులను ఎలా పర్యవేక్షిస్తున్నది ప్రత్యక్షంగా చూపించారు. మొబైల్ యాప్ తో పైప్ లైన్ పనుల పురోగతిని ఎలా తెలుసుకుంటారో వివరించారు. ఈ సందర్భంగా వెబ్ సైట్, మొబైల్ యాప్ ను నలుగురు ఇంజనీర్లే రూపొందించారని తెలుసుకుని ఆసిఫ్ ఆశ్చర్యపోయారు. దేశంలోని మిగతా ప్రభుత్వ విభాగాలకు RWS&S రోల్ మోడల్ అని ప్రశంసించారు. మిషన్ భగీరథ నిర్మాణాలతో పాటు భూగర్భ పైప్ లైన్ డిజిటలైజేషన్ ను డీఈఈ జ్యోతి వివరించారు. మిషన్ భగీరథ కు సంబంధించిన సమస్త సమాచారాన్ని డిజిటల్ రూపంలో జియోస్పేషియల్ డేటాబేస్ లో భద్రపరుస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జియోస్పేషియల్ డేటాబేస్ వివరాలను ఆసక్తిగా విన్న ఆసిఫ్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తనకు ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలకు ఇలాంటి ఒక డేటాబేస్ ఉంటే బాగుంటుందన్నారు. ఈ సమావేశంలో కన్సల్టెంట్ నర్సింగరావు, ఈఈ మూర్తి, డీఈలు జ్యోతి,ప్రశాంత్ రెడ్డి, విజయ్ కుమార్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.