నర్సంపేట పట్టణ రూపురేఖలు మారేలా అభివృద్ధి చేసుకునే దిశగా పనిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన పట్టణ పురపాలిక సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మేరకు అధికారులకు ,ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన కార్యక్రమాల రూపకల్పన పైన మంత్రి పలు సలహాలు, సూచనలు చేశారు.నర్సంపేట పట్టణ అభివృద్ధి , విస్తరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అక్రమ లేఔట్లను ఏ మాత్రం సహించేది లేదని, అలాంటి వాటి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ను ఆదేశించారు.
నర్సంపేట అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయలను కేటాయించడంతోపాటు ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీ రామారావు కు , రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సూచించిన కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించేందుకు ఆగస్టు మాసంలో నర్సంపేట పట్టణంలో పర్యటించాల్సిందిగా మంత్రిని సుదర్శన్ రెడ్డి కోరారు.ఈ సమీక్ష సమావేశంలో సిడి ఎం ఏ శ్రీదేవితో పాటు ఇతర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.