మత్స్యకారుల సంక్షేమం, అభివృద్దికోసం గతంలో ఎన్నడు లేనివిధంగా వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో పశుసంవర్ధక శాఖా కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్య కమిషనర్ సువర్ణ లతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య రంగ అభివృద్దికి నామమాత్రపు కేటాయింపులు జరిగాయని అన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద మత్స్య కారులకు 75 నుండి 100 శాతం సబ్సిడీ పై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రక్ లను అందిస్తామని ఆయన వివరించారు. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించామని , పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడా బ్యాంక్ లతో సంబంధం లేకుండా ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని నీటివనరులలో ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నట్ల్డు తెలిపారు. గత సంవత్సరం 51 కోట్ల చేపపిల్లలను విడుదల చేయగా ఈ సంవత్సరం 80 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నట్ల్డు మంత్రి తెలిపారు. చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు గాను వీడియో చిత్రీకరణ చేస్తున్నట్లు వెల్లడించారు. కులవృత్తులపై ఆధారపడిన వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గొర్రెలు, చేపలను పంపిణీ చేస్తుంటే ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారని, విమర్శించడం అంటే ఆయా సామజికవర్గాల వారిని అవమానిచడమే అన్నారు.