గత ఏడాది ఉట్నూరు పర్యటనలో కడెం ప్రాజెక్టుకు సంబంధించి డి-13 కాలుప పరిధిలోని రైతులు మంత్రి
హరీష్ రావును కలిసి కాలువ మరమ్మతులు చేయాలని కోరారు. ఈ కాలువ పరిధిలో చివరి ఆయకట్టుకు
నీరందడం లేదని చెప్పారు. ఇందుకు స్పందించిన మంత్రి కాలువ మరమ్మతులు చేపడతామని వారికి హామీ
ఇచ్చారు. ఇవాళ ఇందుకు సంబంధించి 10.47 కోట్లతో డి-13 కాలువ మరమ్మతులు చేసేందుకు పరిపాలన
పరమైన అనుమతులకు మంత్రి హరీష్ రావు ఆమోద ముద్ర వేశారు.డి-13 కాలువ పరిధిలో క్రాస్ డ్రైనేజీ
వర్క్ పాత కాలం నాటివి, రాళ్లతో నిర్మించినవి. అవి శిధిలమైన చోట సిమెంట్ పనులు చేపట్టనున్నారు.
వీటితో పాటు వంతెనలు, తూములు, డ్రాప్స్, సైఫన్, గైడ్ వాల్స్, నిర్మాణాలకు సంబంధించి రక్షణ గోడలు (
అబర్ట్ మెంట్స్) , పియర్స్ ఇలాంటి వాటి మరమ్మతులు చేపట్టనున్నారు. కాలువ కట్టలను పటిష్టం చేయడం,
మొరం మట్టితో కాలువ చుట్టు మట్టిని గట్టిపరచడం, సీ.ఎన్.ఎస్ ట్రీట్ మెంట్ పనులు, ప్రస్తుతం ఉన్న
నిర్మాణాలకు మరమ్మతులు, పూర్తిగా పాడయిన నిర్మాణాలు ఉన్న చోట కొత్తవి నిర్మించడం, 75 మిల్లీ
మీటర్లు మందంతో కాలువ లైనింగ్ పనులు చేపట్టనున్నారు. తూముల షట్టర్ల మరమ్మతులు
చేపట్టనున్నారు.
2005లో ప్రారంభం కావాల్సిన మరమ్మతులు…నేడు మంత్రి హరీష్ రావు చొరవతో…
—————————————————————-
కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఎడమ ప్రధాన కాలువ డి-13 కాలువ జన్నారం మండలం లో
28.90 కిలోమీటర్ల వద్ద ప్రారంభమవుతుంది. దీని పొడవు 9.50 కిలోమీటర్లు. దీనికి ఐదు ఉప కాలువులు
ఉన్నాయి. ఇవి కిష్టాపూర్, జన్నారం, కమాన్ పల్లి, పొనకల్లు, రాయిండ్ల గూడెం, కాలమడుగు, ధర్మారం,
బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాల ఆయకట్టుకు నీరందిస్తాయి. అయితే కాలమడుగు, బాదంపల్లి, ధర్మారం,
పుట్టిగూడకు అసలు నీరు వచ్చే పరిస్థితి లేదు. ఈ గ్రామల పరిధిలో 2 వేల ఎకరాలకు నీరందేది కాదు.
కాలువ పాడవడం, సిల్ట్ తో నిండిపోవడం, గైడ్ వాల్స్ పాడయిన పరిస్థితి ఉంది. అయితే కడెం ప్రాజెక్టు మొత్తం
ఆయకట్టు 68 వేల ఎకరాలు కాగా, ఇందులో డి-13 కాలువ ద్వారా 5575 ఎకరాలకు నీరందించాల్సి ఉంది.
అయితే డి-13 డిస్ట్రిబ్యూటరీ కాలువ పరిధిలోని వీటి మరమ్మతులకు 2005లోనే అప్పటి ప్రభుత్వం 7.22
కోట్ల అంచనాతో టెండర్లు పిలిచింది. అయితే గుత్తేదారులు పనులు ప్రారంభించకుండా, ఆపేయడంతో ఈ
కాలువ మరమ్మతు పనులు అటకెక్కాయి. అయితే ఉట్నూరు గ్రామస్థులు చివరి ఆయకట్టుకు నీరు రావడం
లేదని మంత్రి హరీష్ రావుకు ఫిర్యాదు చేయడంతో… ఆయన ఆదేశాలతో అధికారులు మరమ్మతు
ప్రతిపాదనలు పంపారు. వీటికి ఇవాళ మంత్రి ఆమోద ముద్ర తెలిపారు. డి-13 మరమ్మతులతో పాటు
గోదావరి నదిపై రెండు చెక్ డ్యాంల సర్వేలకు మంత్రి హరీష్ రావు ఆమోదం తెలిపారు. ఇందులో భాగమయిన
బెల్లాల్, భోనుపల్లి లో చెక్ డ్యాంలకు సర్వేకు గాను 6.80 లక్షల మంజూరు చేస్తూ పరిపాలన పరమైన
అనుమతులు జారీ చేశారు.