‘నీతి ఆయోగ్’ సంసిద్ధత సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు:
అమరావతి, జూన్ 15: రాజధాని అమరావతి రూపంలో దేశం గర్వించే స్థాయిలో హరిత నగరం నిర్మిస్తున్నామని, ఈ నగరం మీద వచ్చే ఆదాయంలో అధికభాగం కేంద్రానికి వెళుతుందని, అలాంటప్పుడు అమరావతి నిర్మాణానికి సహాయనిరాకరణ ఎందుకో అర్ధం కావటం లేదని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్రం విశ్వసనీయత కోల్పోతున్నదని, కో-ఆపరేటివ్ ఫెడరలిజం సూత్రాలకు కేంద్ర వైఖరి హానికరంగా మారిందని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇలాంటి నగర నిర్మాణానికి కేంద్రం అథికంగా నిధులిచ్చి ఆదుకోవాల్సింది పోయి అడ్డుకోవటం ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఈనెల 17న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావనాంశాలు, విభజన చట్టం అమలు చేయకపోవటంతో ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు.
జలవనరుల నిర్వహణ, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జలవనరుల రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానంపై అధికారులు మరింత పరిశోధనతో కచ్చితమైన గణాంకాలు తయారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయానికి కేంద్రం కేటాయింపులు సరిగ్గా లేవని ముఖ్యమంత్రి అన్నారు. భూగర్భ జలవనరుల స్థాయిలో మనరాష్ట్రం అగ్రగామిగా ఉందని చెప్పారు.
వాటర్ షెడ్ డెవలప్మెంట్ లో పంజాబ్ మొదటి స్థానంలో ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సరఫరా ప్రతిభా సామర్ధ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. పాలసీ అండ్ గవర్నెన్స్ విభాగంలో గుజరాత్ ఆంధ్రప్రదేశ్‌కంటే 8 పాయింట్లు ముందుండి ప్రథమస్థానంలో నిలిచిందని, ఇదే సమయంలో కర్నాటక మనకంటే 12 పాయింట్ల దిగువన ఉందని వివరించారు. అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిచేందుకు ఏమి చర్యలు తీసుకోవాలో అధ్యయనంతో సిఫారసు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు.
విభజన చట్టం ప్రకారం ఇచ్చిన ప్రత్యేక హోదా సహా అనేక హామీలను నెరవేర్చాలని, పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలులో మన రాష్ట్రం ముందున్నట్లు తెలిపారు. కోరిన ప్రతి ఇంటికీ వంటగ్యాస్ ఇచ్చి దేశంలో అగ్రభాగాన ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. మాతాశిశుమరణాల రేటును గణనీయంగా తగ్గించామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై పూర్తిస్థాయిలో వివరాలు చేర్చాలని కోరారు.
మన రాష్ట్రం దేశంలో మిగిలిన రాష్ట్రాలకంటే ఏఏ రంగాల్లో మెరుగైన స్థితిలో ఉందో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలలో మనమే వెనుకబడి ఉన్నామని, అందువల్ల మన రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో సమంగా తలసరి ఆదాయం సాధించేదాకా సహకరించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు.
ఎన్ని అవరోధాలున్నా కేంద్ర సహకారం లేకున్నా ఒక విజన్‌తో రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేశామని తెలిపారు. యాభై లక్షల మందికి సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. విభజనతో వచ్చిన సమస్యలు ఎదురైనా, ఆర్ధికంగా ఎన్ని అవరోధాలున్నా, అభివృద్ధి, సంక్షేమంలో ఎక్కడా రాజీలేకుండా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. చంద్రన్న-పి.ఎం.జె.జె బీమా పథకం దిగ్విజయంగా అమలు చేస్తున్న విషయాలున్నాయని, నాలుగేళ్లలో ఏమీ సాధించలేదని దుష్ప్రచారం చేసేవారికివే ఇవే జవాబులని చెప్పారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో భాగంగా ఓడీఎఫ్ సాధనలో ముందున్నామన్నారు.
నాలుగేళ్లలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌తో, మౌలిక సదుపాయాల వృద్ధితో ప్రజా జీవనాన్ని మెరుగైన స్థితికి తెచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. భూగర్భ జలాలలో, వాటర్ మేనేజిమెంట్ లో ముందున్నామంటే అదంతా రాష్ట్రప్రభుత్వం, ఉద్యోగుల కష్టం, ప్రజా సహకారం వల్లనే అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. వృద్ధిరేటులో దేశంలో రెండంకెల వృద్ధి రేటు సాధించడం ఆషామాషీ విషయం కాదన్నారు. తమ ప్రభుత్వ దార్శనిక విధానాలు, ఉద్యోగుల సహకారంతో సాధ్యమైందని చంద్రబాబు చెప్పారు. ప్రణాళికా విభాగం కార్యదర్శి సంజయ్ సింగ్ రూపొందించిన ప్రస్థావనాంశాలకు ముఖ్యమంత్రి కొన్ని, మార్పులు చేర్పులు సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శులు ఎ.వి. రాజమౌళి, ఎం. గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు