*వైద్య ఆరోగ్యశాఖ అభివృద్ధిలో మరో మైలు రాయి తెలంగాణ డయాగ్నోస్టిక్స్* *తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాధి నిర్దారణ పరీక్షలు**శనివారం ఐపిఎంలో ప్రారంభించనున్న మంత్రులు కెటిఆర్, లక్ష్మారెడ్డి*
*హైదరాబాద్ః* శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వైద్య ఆరోగ్యశాఖలో మరో మైలు రాయిగా నిలువనుంది తెలంగాణ డయాగ్నోస్టిక్స్. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించనుంది. వైద్య ఆరోగ్య సేవలను విస్తృతం చేస్తూ, మెరుగు పరచడం కోసం ప్రభుత్వ ప్రవేశ పెట్టిన అనేక పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కార్ దవాఖానాల ద్వారా వైద్య సేవలు పొందే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వాళ్ళకి మరింత మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు కూడా అందించేందుకు *తెలంగాణ డయాగ్నొస్టిక్స్* ని ప్రారంభిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. *హైదరాబాద్‌లోని ఐపిఎం ఆవరణలో గల డయాగ్నోస్టిక్ సెంటర్‌ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి లు శనివారం ప్రారంభించనున్నారు.* పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన సర్వేల్లో ప్రజల రోగ నిర్ధారణ పరీక్షల కోసం తమ ఆదాయంలో అధిక మొత్తంలో ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల పాలవుతున్నట్లు గుర్తించాం. ప్రజలకు ప్రభుత్వం ద్వారా ఉచిత ఆరోగ్య సేవలు, కచ్చితమైన వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో మొదటి దశలో హైదరాబాద్ పరిధిలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రారంభించడం జరిగింది.
తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్ హైదరాబాద్ నారాయణ గూడ ఐపిఎం ఆవరణలో ఏర్పాటు జరిగింది. ఈ సెంట్రల్ హబ్‌కి హైదరాబాద్ నగర పరిధిలోని ఒక జిల్లా హాస్పిటల్, 5 ఏరియా హాస్పిటల్స్, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 120 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్లు, బస్తీ దవాఖానాల నుండి రోగ నిర్ధారణ పరీక్షల శాంపిల్స్ సేకరణ జరుగుతున్నది. ఈ సెంట్రల్ హబ్ 24గంటలూ పని చేస్తుంది.
అంతేగాక 8 సామాజిక ఆరోగ్య కేంద్రాలు మినీ హబ్‌లుగా ఉంటాయి. అలాగే అల్ట్రా సౌండ్, ఎక్స్‌రే, ఈసీజీ సేవలు కూడా సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ నిర్వహణకు కావాల్సిన సాంకేతిక సహాయం టాటా ట్రస్ట్ అందిస్తున్నది.
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాలల్లో సేకరించిన శాంపిల్స్ ని సెంట్రల్ హబ్‌కి చేర్చడానికి 8 వాహనాలు ఏర్పాటు చేయడమైనది. శాంపిల్స్ సేకరణ నుండి సెంట్రల్ హబ్ చేరే వరకు సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యం కోసం సిబ్బందికి పూర్తి శిక్షణ ఇవ్వడమైనది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గంటలో 200 నుంచి 1000 వరకు పరీక్షలు నిర్వహించడానికి వీలవుతుంది.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, టాటా ట్రస్ట్ బాధ్యులు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సిబ్బంది తదితరులు పాల్గొంటారు.