సోమవారం కరీంనగర్ వెల్‌నెస్ సెంటర్‌కు ప్రారంభోత్సవం
*సోమవారం కరీంనగర్ వెల్‌నెస్ సెంటర్‌కు ప్రారంభోత్సవం* *ప్రారంభించనున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి* *కరీంనగర్, గోదావరి ఖనిలలో డయాలసిస్ కేంద్రాల ప్రారంభం* *కరీంనగర్‌లో ఆయుష్ హాస్పిటల్‌కు శంకుస్థాపన, అర్బన్ హెల్త్ ప్రారంభం*
హైదరాబాద్ః వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సోమవారం కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కరీంనగర్ లో వెల్‌నెస్ సెంటర్‌కు ప్రారంభోత్సవం చేస్తుండగా, ఆయుష్ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసి, హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రారంభిస్తారు. అనంతరం కరీంనగర్, గోదావరి ఖనిలలో డయాలసిస్ కేంద్రాల మంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మంత్రి వెంట ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు.
ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారి కుటుంబాల ఓపీ వైద్య సేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వెల్‌నెసట్ సెంటర్లలో భాగంగా 5వది సోమవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభం కానున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, వనస్థలిపురం, వరంగల్, సంగారెడ్డిలలో వెల్ నెస్ సెంటర్లు విజయవంతంగా నడుస్తున్నాయి. తాజాగా కరీంనగర్‌లో వెల్ నెస్ సెంటర్ ప్రారంభం కానున్నది. దీన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటి దాకా కరీంనగర్ జిల్లా సహా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారి కుటుంబాలు హైదరాబాద్ వెల్ నెస్ సెంటర్‌కి వ్యయ ప్రయాసలకోర్చి వస్తున్నారు. కరీంనగర్ వెల్ నెస్ ప్రారంభమవుతుండటంతో ఆయా జిల్లాల ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఓపీ సేవలు చేరువ అవుతాయి.
అలాగే రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించాలని ప్రభుత్వం తలపెట్టగా అందులో దాదాపు సగానికి పైగా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వాటిలో మరో రెండు డయాలసిస్ కేంద్రాలను వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. కరీంనగర్, గోదావరి ఖనిలలో ఈ రెండు సెంటర్లు రేపటి నుండి పని చేయడం ప్రారంభిస్తాయి. దీంతో కరీంనగర్, గోదావరిఖని చుట్టు ముట్టు ప్రాంతాల కిడ్నీ బాధితులకు ఊరట లభిస్తుంది. డయాలసిస్ పూర్తి ఉచితంగా అందుబాటులోకి వస్తుంది.
అలాగే కరీంనగర్ లో సోమవారం శంకుస్థాపన చేస్తున్న ఆయుష్ హాస్పిటల్‌లో దేశీయ వైద్యం అందుబాటులో ఉంటుంది. దేశీయ వైద్యంపై ప్రజల్లో మక్కువ పెరుగుతున్న ఈ రోజుల్లో ఆయుష్ హాస్పిటల్ కరీంనగర్ ప్రజలకు చేరువ కావడంలో ఎంపీ వినోద్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. అర్బన్ హెల్త్ సెంటర్ స్థానిక ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందిస్తుంది. కరీంనగర్ నగరంలో ప్రారంభమవుతున్న అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా విద్యానగర్, సప్తగిరి, హౌసింగ్ బోర్డు కాలనీల ప్రజలకు ఎంతో ఉపయోగం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమవుతున్న వైద్య సేవల్లో కొన్ని సోమవారంతో కరీంనగర్, గోదావరిఖని ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఆయా వైద్య సేవలను సంబంధిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.
*కార్యక్రమాల వివరాలు*
ఉ.10.00 గంటలకు కరీంనగర్‌లో వెల్ నెస్ కేంద్రం, డయాలిసిస్ కేంద్రాల ప్రారంభం. ఆయుష్ హాస్పిటల్ కి శంకుస్థాపన
ఉ. 10.45 గంటలకు కరీంనగర్, విద్యానగర్, సప్తగిరి, హౌసింగ్ బోర్డు కాలనీలలో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం
మ.12.30 గంటలకు గోదావరి ఖనిలో డయాలిసిస్ కేంద్రం ప్రారంభం
Post Comment