ఐఏఎస్ టాపర్ తో టి-సాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం
*ఐఏఎస్ టాపర్ తో టి-సాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం* హాజరుకానున్న రాచకొండ పోలీసు కమిషనర్ ఎం.ఎం.భగవత్
(టి.సాట్-సాఫ్ట్ నెట్)
సివిల్ సర్వీసెస్ 2017 బ్యాచ్ కు సంబంధించి ఆల్ ఇండియా ప్రథమ ర్యాంకు సాధించిన తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ టి.సాట్-సాఫ్ట్ నెట్ నిర్వహించే ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి హాజరుకానున్నారు.ఆయనతో పాటు దేశవ్యాప్తంగా సివిల్స్ ఇంటర్వూకు ఎంపికైన అభ్యర్థులకు తనదైన సహకారం అందిస్తూ మార్గదర్శిగా నిలుస్తున్న తెలంగాణ రాచకొండ పోలీసు కమిషనర్ ఎం.ఎం.భగవత్ కూడా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొంటారు.
శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు టి-సాట్ స్టూడియోలో జరిగే ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఐఏఎస్ టాపర్ అనుదీప్, సీనియర్ పోలీసు అధికారి ఎం.ఎం.భగవత్ పాల్గొంటారని టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి తెలిపారు.సీఈవో శైలేష్ రెడ్డి గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పోటీ పరీక్షలకు తెలంగాణ యువతకు చేయూత నిచ్చే కార్యక్రమంలో భాగంగా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను టి-సాట్ స్టూడియోకి ఆహ్వానించినట్లు తెలిపారు.సీనియర్ పోలీసు అధికారి ఎం.ఎం.భగవత్ సివిల్స్ కు సిద్ధమయ్యే అనేక మంది యువతను ప్రోత్సహిస్తున్నారని సీఈవో చెప్పారు. సివిల్స్ లో ఇంటర్వూ పూర్తయ్యాక అభ్యర్థులు ఎలా ముందుకెళ్లాలో సలహాలు-సూచనలు అందిస్తున్న భగవత్ స్టూడియోలో జరిగే లైవ్ కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకోనున్నారని వివరించారు. దేశంలోనే మొదటి ర్యాంకు సాధించి తెలంగాణకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టిన అనుదీప్-దేశవ్యాప్తంగా సివిల్స్ ఆశావహులకు మార్గదర్శకంగా నిలుస్తున్న మహేష్ మురళీధర్ భగవత్ వీరిద్దరు టి-సాట్ స్టూడియో ద్వార అందించే సలహాలు-సూచనలు, అనుభవాలను తెలంగాణ యువత వినియోగించుకోవాలని కోరారు.తెలంగాణ ఆవిర్భావం తరువాత తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యంలో భాగంగా పోటీ పరీక్షల్లో సింహాభాగం తెలంగాణ యువతకు దక్కేందుకు చేస్తున్న ప్రయత్నంలో లక్ష్య సాధన వైపు అడుగులేస్తున్నామని సీఈవో ధీమా వ్యక్తం చేశారు.ఆ ప్రయత్నంలో భాగంగా అవగాహన, ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు.ఐఏఎస్ అనుదీప్ తాను సాధించిన మొదటి ర్యాంకు కోసం కృషి చేసిన తీరును వివరించనున్నారని, ఎం.ఎం.భగవత్ తాను సాధించిన ఐ.పి.ఎస్., ప్రస్తుతం సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే వారికి తాను అందిస్తున్న సహాకారం గురించి తెలియజేయనున్నారని, వీరితో మాట్లాడాలనుకునే వారు టి-సాట్ టోల్ ఫ్రి నెంబర్ 18004254038, ల్యాండ్ లైన్ 040 23553473, 040 23551989 నెంబర్లకు కాల్ చేయాలని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి కోరారు.
Post Comment