. మే చివరి నాటికి సిరిసిల్ల జిల్లాలోని అన్ని ఆవాసాలకు దశలవారీగా శుద్ది చేసిన తాగునీరు బల్క్ గా సరాఫరా అవ్వాలన్నారు RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి. ఇప్పటికే వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీల తో పాటు 61 ఆవాసాలకు శుద్ది చేసిన భగీరథ నీళ్లు సరాఫరా అవుతున్నాయన్నారు. ఇవాళ సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించిన ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి మిషన్ భగీరథ పనుల పురోగతిని పరిశీలించారు. ముందుగా సిరిసిల్ల జిల్లా అగ్రహారం దగ్గర 120MLD నీటి శుద్ధి కేంద్రాన్ని ఈ.ఎన్.సి పరిశీలించారు. ఫిల్టర్ బెడ్ లలో జరుగుతున్న నీటి శుద్ది ప్రక్రియను చూశారు. సంప్,పంప్ హౌజ్ లలో మోటార్లు, పంపుల బిగింపు ప్రక్రియను పరిశీలించారు. మారుపాక గుట్ట మీద కట్టిన GLBR కు శుద్ది చేసిన నీటిని పంప్ చేసే రెండవ మోటార్ ట్రయల్ రన్ ను ఈ.ఎన్.సి ప్రారంభించారు. రామప్ప గుట్ట GLBR కు మోటార్ల డ్రై రన్ ను పర్యవేక్షించారు. ఆ తర్వాత అక్కడే సిరిసిల్ల జిల్లా మిషన్ భగీరథ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మిగిలిన చిన్న చిన్న పనులు పూర్తి చేసి అగ్రహారం WTP లో పూర్తి స్థాయిలో మోటార్లు, పంపులను ఆన్ చేయాలన్నారు. దశల వారీగా జిల్లాలోని ఆవాసాలకు నీటిని సరాఫరా చేయాలన్నారు. ఈ నెల చివరి నాటికి చివరి ఆవాసానికి బల్క్ గా నీటిని అందించే ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఇక జిల్లాలో జరుగుతున్న ఇంట్రా విలేజ్ పనుల ప్రస్తుత స్థితిని అధికారులు ఈ.ఎన్.సి కి తెలియచేశారు. ఫ్లో కంట్రోల్ వాల్వ్, ఇంట్రా పైపులతో పాటు అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉందని చెప్పారు. ఇంట్రా పనులను వేగంగా పూర్తి చేసి జులై చివరి నాటికి ప్రతీ ఇంటికి నల్లాతో నీటిని సరాఫరా చేయాలని అధికారులను ఈ.ఎన్.సి ఆదేశించారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా డబ్బాలో నిర్మించిన 145 MLD నీటి శుద్ది కేంద్రాన్ని ఈ.ఎన్.సి పరిశీలించారు. పంప్, సంప్ హౌజ్ లతో పాటు ల్యాబ్ ను చూశారు. డిపార్ట్ మెంట్ కు చెందిన కెమిస్ట్ లు నీటి శుద్ది కేంద్రంలోనే ఉండాలని సూచించారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా భగీరథ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఈ.ఎన్.సి, ఏప్రిల్ చివరి నాటికి జిల్లాలోని 13 మండలాల్లోని 348 ఆవాసాలకు బల్క్ గా శుద్దిచేసిన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. ఒకప్పుడు తాగునీటి ప్రాజెక్టులంటే దశాబ్దాల పాటు పనులు జరిగేవని,అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రోత్సాహంతో అతి తక్కువ కాలంలోనే భగీరథ ప్రాజెక్టు పూర్తి అయిందన్నారు. డిపార్ట్ మెంట్ లోని ప్రతీ ఒక్క ఇంజనీర్ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడడంతోనే ఇది సాధ్యం అయిందన్నారు. ఇక్కడి నుంచి కరీంనగర్ జిల్లా ఎల్.ఎం.డి కాలనీలో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను ఈ.ఎన్.సి పరిశీలించారు. పనులు ఆలస్యంగా చేస్తున్నారని అధికారులతో పాటు వర్క్ ఏజెన్సీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఫిల్టర్ బెడ్ ల టెస్టింగ్ ప్రారంభించి, ఈ నెలాఖరులోపు ట్రీట్ మెంట్ ప్లాంట్ ట్రయల్ రన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆ తర్వాత మిషన్ భగీరథ ఎల్.ఎం. డి సెగ్మెంట్ లోనే అతి క్లిష్టమైన పోరండ్ల,మహ్మదాపూర్ గుట్టలపై నిర్మిస్తున్న GLBR, పైప్ లైన్ పనులను పరిశీలించారు. భౌగోళిత ప్రతికూలతలను అధిగమించి, రెండు గుట్టల మీద భారీ నిర్మాణాలను అనుకున్న సమయంలోనే పూర్తి చేశారని అధికారులను ప్రశంసించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి, సిరిసిల్ల ఎస్.ఈ లు శ్రీనివాస్ రావు, అమరేందర్, ఈఈ జ్ఞానకుమార్, చల్మారెడ్డి, విజయ్ కుమార్, కన్సల్టెంట్ మనోహర్ బాబు తో పాటు వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు