: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు.డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ ప్రగతిపై తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో జిల్లా నోడల్ అధికారులు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో సోమవారం చిత్రా రామచంద్రన్ సమీక్ష నిర్వహించారు. 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను జూన్ 2018 లోగా పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. కొన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్ తో పోలిస్తే డబుల్ ఇళ్లకు తక్కువ ధరకే స్టీల్ ను విక్రయించేందుకు ఉక్కు తయారీదారులు అంగీకరించిన నేపథ్యంలో కాంట్రాక్లర్లు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. టన్ను స్టీలుపై 9వేల 440 రూపాయలు తగ్గించి 43వేల 660 రూపాయలకు సరఫరా చేయడానికి కంపెనీలు అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. బహిరంగ మార్కెట్లో ఉక్కు ధర రూ.53,100 ఉన్న విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో అధికారులు ఆశించిన మేరకు పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పర్యవేక్షించాలని కోరారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి నిధుల కొరత లేదని, ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చెల్లింపులు చేస్తున్నట్లు వారికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ సత్యమూర్తి, ఆయా జిల్లాల నోడల్ అధికారులు, పంచాయత్ రాజ్,ఆర్ అండ్ బీ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు,గిరిజన సంక్షేమ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.