అపురూప గ్రంథం ” కారణాగమం ” ఆవిష్కరణ మహా శివరాత్రి పర్వదినాన జరిగింది . శ్రీశైలం దేవస్థానం ప్రచురించిన ఈ ” కారణాగమం ” మొదటి భాగాన్ని ఈ ఉదయం అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో సంప్రదాయ రీతిలో ఆవిష్కరించారు .దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు . శ్రీశైల ప్రభ పూర్వ సంపాదకులు డాక్టర్ ఎం. చక్రవర్తి , వేదపండితులు , అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు . శైవాగమానికి చెందిన 28 ఆగమాలలో ” కారణాగమం ” ఒకటి . 20 ఏళ్ళ పూర్వం దేవస్థానం ప్రచురించిన ఈ గ్రంథం ప్రతులు విక్రయమైనాయి . భగవంతునికి కైంకర్యం చేసే వైదిక సిబ్బందికి ఉపయుక్తంగా ఉండాలన్న భావంతో ప్రస్తుతం ” కారణాగమం ” మొదటి భాగం పునర్ముద్రితమైంది . ” కారణాగమం ” పూర్వ భాగంలోని ద్వితీయ , తృతీయ భాగాలు , ఉత్తర భాగాన్ని ఆరు మాసాల్లో ప్రచురించాలని దేవస్థానం నిర్ణయించింది . దేవస్థానం కోరిక మేరకు ఈ పునర్ముద్రణలో ఆయా అంశాలకు తెలుగులో అర్థ వివరణ ఇచ్చారు . ప్రముఖ పండితులు శ్రిష్టి లక్ష్మీధర శర్మ , శ్రిష్టి సీతారామాంజనేయ శర్మ ఇందుకు సహకరించారు . ఆగమ శాస్త్రాలు ప్రధానంగా ఆలయ నిర్మాణం , దేవతా ప్రతిష్ట , అర్చన, ఉత్సవ , ప్రాయశ్చిత్త0 మొదలైన అంశాలను వివరిస్తాయి. మంచి గ్రంథం రావడం ముదావహం .