మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి భరత్ ఆదివారం దేవస్థానం పరిధిలో క్షేత్ర పర్యటన జరిపారు . పలువురు అధికారులు ఆయన వెంట ఉన్నారు . ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి . ఇప్పటికే ఈ.ఓ. పలుమార్లు సమీక్ష సమావేశాలు జరిపి ఆయా విభాగాలకు పలు సూచనలు చేసారు . కాగా రోజువారి సమీక్షలు , రోజువారి క్షేత్ర పర్యటనలు కుడా జరుగుతున్నాయి . అందులో భాగంగా ఈ.ఓ. ఆదివారం క్షేత్ర పర్యటన జరిపి ఏర్పాట్లు చూసారు . కైలాస ద్వారం , యజ్ఞవాటిక వద్ద పార్కింగ్ ప్రదేశాలు , శివదీక్ష శిబిరాలు , పాతాళ గంగ మార్గంలోని వసతి సముదాయం , పలు ఉద్యానవనాలు , చంద్రవతి కల్యాణ మండపం , కుమార సదనం , అన్నదాన భవన ప్రాంగణం తదితర వాటిని ఈ.ఓ పరిశీలించారు . శివదీక్ష భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన సూచనలు చేసారు . కైలాస ద్వారం వద్ద అదనంగా చలువ పందిళ్ళు వేయాలన్నారు . కైలాస ద్వారం వద్ద అన్నదానం చేసే స్వచ్ఛంద సేవకులకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు . అవసరమైన మేరకు మంచినీటిని సరఫరా చేయాలని ఈ.ఈ. ని ఆదేశించారు . ఉద్యానవనాలలో గతం కంటే అధికంగా షామియానాలు వేయాలన్నారు .
కుమార సదనం తదితర అతిథి గృహాలను ఈ.ఓ. పరిశీలించారు . ఆయా ప్రాంగణాలలో భక్తులు విశ్రమించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈ.ఓ సూచించారు . భక్తులకు వీలుగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు .
నేడు హుండీ కౌంటింగ్
నేడు ఉభయ దేవాలయాల హుండీ కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసారు. పారదర్శతకోసం స్థానికులు , భక్తులకు కుడా ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు .