పుణ్యక్షేత్రాల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తున్న కెసిఆర్ – పీఠాధిపతుల ఆశీర్వాదం
ఆధ్మాత్మిక భావనలను పెంపోదించే కార్యక్రమాలను చిత్త శుద్దితో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అభిష్టం నెరవేరాలని శ్రీ శ్రీ శ్రీ దేవానాధ రామానుజ జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీనివాస వ్రతధార రామానుజ జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ అభిలాషించారు. పుణ్యక్షేత్రాల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక భావనలను పెంపొందిస్తున్న కేసీఆర్కు భగవంతుడు శుభం చేకుర్చాలని ఆశీర్వదించారు.
గురువారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి పీఠాధీపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. శుక్రవారం సుర్యోదయాన 5.58 నిమిషాల నుంచి 6.30 గంటల మధ్య పుణ్య స్నానమాచరించి కృష్ణ పుష్కరాలను ప్రారంభించనున్నారు. పుణ్య స్నానమాచరించిన తర్వాత సిఎం కుటుంబ సమేతంగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ముఖ్యమంత్రి వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి, జిల్లా ఎమ్మెల్యేలతో పాటు టీ న్యూస్ ఎండీ సంతోష్ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలంపూర్ కు బస్సులో వెళ్లుతుండగా మార్గ మధ్యలో రంగాపూర్-బీచుపల్లి పుష్కర ఘాట్ ను సందర్శించారు. సంప్రదాయాన్ని అనుసరించి ముఖ్యమంత్రి కృష్ణా నదిలోకి నాణేలను జార విడిచారు.