భూమి , నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు ప్రధానపాత్ర వహిస్తున్నాయని , ఈ పంచభూతాలు పరమేశ్వరుని స్వరూపమని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అన్నారు. శ్రీశైలం పుష్కరిణి వద్ద జరుగుతున్న ప్రవచనంలో వద్దిపర్తి శనివారం అయిదో రోజు మరిన్ని విశేషాలు చెప్పారు. అర్ధనారీశ్వర తత్త్వంపై వద్దిపర్తి ప్రవచనం చేస్తున్నారు.సకల చరాచర సృష్టికి పరమేశ్వరుడే అధిపతి అనీ అందుకే ఈశ్వరనామం ప్రసిద్ధమైందని ఆయన వివరించారు. శివలింగ స్వరూపాన్ని వివరించారు. పార్వతీపరమేశ్వరులు సనాతన దంపతులని , రుక్మిణీదేవి ఉమామహేశ్వరులను అర్చించే శ్రీకృష్ణుని భర్తగా పొందినట్లు భాగవతం చెబుతోందని వద్దిపర్తి వివరించారు. పరమేశ్వరుడు భక్త సులభుడని జంతువులు కుడా స్వామి అనుగ్రహంతోశివసాయుజ్యాన్ని పొందాయన్నారు.కిరాతకుడైన కన్నప్ప మూఢభక్తితో మెప్పించాడని, శ్రీకాళహస్తీశ్వర ఘట్టాన్ని వివరించారు. రుద్రుని పూజించేవారు ముందుగా స్వయం రుద్రులు కావాలన్నారు. మధ్యలో శ్రీశైలం మహిమలు ప్రస్తావించారు. అగస్త్యుని శ్రీశైల యాత్రా విశేషాలు వివరించారు. అగస్త్య మహర్షి ధర్మపత్ని సమేతంగా శ్రీశైలంలో శ్రీ స్వామి అమ్మ వారిని సేవించినట్లుగా కాశీఖండం చెబుతోందన్నారు . కుమ్మరి కేశప్ప కథను చెప్పారు. తుంబరుడు స్వామిని సేవించి అనుగ్రహం పొందిన తీరు చెప్పారు. ప్రవచనంలో అనేక ఉదంతాలను వివరించారు.