కర్నూలులో 125 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన స్టేట్ కాన్సర్ సెంటర్ కు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 55 కోట్ల రూపాయలు విడుదల చేసిందని రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్ తెలిపారు. క్యాన్సర్ సెంటర్ రూపకల్పనావిధివిధానాలపై సోమవారం మౌర్య ఇన్ హోటల్లో టాటా ట్రస్ట్ సభ్యులతో సమీక్ష సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎం.పి. మాట్లాడుతూ స్టేట్ క్యాన్సర్ సెంటర్ ను నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యశాల ఆవరణలో 5 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్యాన్సర్ యూనిట్ ను టాటా ట్రస్ట్ రూపకల్పన చేసేందుకు ముందుకు వచ్చిందని వెంకటేష్ చెప్పారు. .ప్రముఖ జాతీయ సర్జికల్ ఆoకాలజిస్ట్, కర్నూల్ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ జగన్నాథం టాటా ట్రస్ట్ కు సలహాదారుగా ఉంటూ ఈ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు తన సేవలు అందివ్వడం అభినందనీయమన్నారు .ఇప్పటికే కేంద్రం తన వాటా నిధులు విడుదల చేయగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయనుందని తెలిపారు.