రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు కొత్తగా నియామకమైన విసిలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు కొత్తగా నియామకమైన విసిలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా విద్య విధానం ఉండాలే తప్ప నిరుద్యోగులను పెంచే విధంగా ఉండవద్దని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. దేశ, విదేశాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని సిఎం సూచించారు. తెలంగాణలో యూనివర్సిటీ విద్య ఎలా ఉండాలి, యూనివర్సిటీలను గాడిలో పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విద్యావేత్తలు, నిపుణులు, అనుభవజ్ఞులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని విసిలను సిఎం ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు కొత్తగా నియామకమైన విసిలతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

 

<
>

యూనివర్సిటీలు విద్యార్థులు చదువుకోవడానికి, అధ్యయనానికి, పరిశోధనలకు వేదికగా మారాలని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో చాలా మంది విసిలు యూనివర్సిటీలను చక్కగా తీర్చిదిద్దారని, ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని కోరారు. విద్యార్థులకు మంచి వసతి, భోజనం కల్పించాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులు ఎంపిక చేసుకుని ప్రవేశ పెట్టాలని, దీనికోసం విసిలు దేశ, విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలు, కోర్సులపై అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఏటా 40 – 45 వేల మంది బిఇడి, డిఇడి లాంటి ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారని, కానీ అంత మొత్తంలో ఉపాధ్యాయుల అవసరం ఏర్పడడం లేదని, వారంతా నిరుద్యోగులుగా మారాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కోర్సుల పరిస్థితి ఇలాగే తయారైందని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉన్న అవకాశాలేమిటి? ఏ కోర్సులు చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది? అనే విషయాలను అవగతం చేసుకుని విద్యార్థులకు మార్గ నిర్దేశం చేయాలని చెప్పారు. ఐటి, ఫార్మా, ఇన్ఫా, మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాలు తెలంగాణ రాష్ట్రంలో బాగా విస్తరిస్తున్నాయని, ఈ రంగంలో కోర్సులు చేసే వారు చదువు కొనసాగించుకుంటూనే కంపెనీల్లో పనిచేసే వెసులుబాటు కల్పించాలని చెప్పారు. అలా వారు అనుభవం గడిస్తారన్నారు. ఆర్ అండ్ బి, ఐబి, పంచాయితీ రాజ్, హౌజింగ్ తదితర శాఖల్లో కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయని, సివిల్ ఇంజనీరింగ్ చేసే వారిని ఆ పనుల్లో భాగస్వాములను చేయడం ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ కోసం కృషి చేయాలని సూచించారు. యూనివర్సిటీల్లో పెడ ధోరణులను పారద్రోలడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం కూడా తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగానే ఉండాలే తప్ప, ఆంధ్రప్రదేశ్ వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు.

తెలంగాణలోని యూనివర్సిటీలకు విసిలుగా అవకాశం వచ్చిన వారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణ యూనివర్సిటీ విద్యకు మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. ఇప్పుడు వేసే బాటలు తెలంగాణ భవిష్యత్ కు ఉపయోగపడతాయన్నారు. యూనివర్సిటీల ఆర్థిక పరిస్థితిపై కూడా విసిలు నివేదిక సమర్పించాలని, వచ్చే బడ్జెట్లో అవసరానికి తగినట్లు నిధులు కేటాయిస్తామని సిఎం చెప్పారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిధుల కేటాయింపులో రాష్ట్ర యూనివర్సిటీలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఇటీవల ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని దృష్టికి తెచ్చినట్లు వెల్లడించారు. యుజిసి నుంచి కూడా ఎక్కువ నిధులు రాబట్టడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని చెప్పారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని, తెలంగాణలో బోగస్ కాలేజీలు లేకుండా చేయాలని చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేయాలన్నారు. యూనివర్సిటీలు నిర్వహించే వివిధ రకాల పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో పేపర్ల లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రో. జయశంకర్ పేరుతో పెట్టకున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం మరింత క్రియాశీలకంగా ఉండాలని సిఎం సూచించారు. గతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసే విత్తనాలకు ఎంతో డిమాండ్ ఉండేదని, తాను కూడా హైదరాబాద్ వచ్చి విత్తనాలు తీసుకుపోయే వాడినన్నారు. ఎంతో విశ్వసనీయత కలిగిన వ్యవసాయ విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం తేవాలని, పరిశోధనలు పెరగాలని సూచించారు. వ్యవసాయంలో అనేక ఆధునిక పద్దతులు వచ్చాయని, వాటిని రైతులు అందిపుచ్చుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయంలో ఉత్పత్తి మాత్రమే పెరుగుతున్నదని, ఉత్పాదకత కూడా పెరగాలని సిఎం అన్నారు. విసిలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.