
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా ఏడో రోజు శనివారం ఉదయం
అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్భనలు, జపానుష్టానాలు,
పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్థానములు,
చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిగాయి.
అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిగాయి.
ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన,
చండీ హోమం జరిపారు.ఈ రోజు రాత్రి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు
జరిగాయి.
కుమారీపూజ:
దసరామహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను
పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించిపూజించారు . కుమారిపూజ నవరాత్రి
ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం
కాళరాత్రి అలంకారం :
నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తిని కాళరాత్రి స్వరూపంలో అలంకరించారు.
నవదుర్గ స్వరూపాలలో ఏడవ రూపం ఈ కాళరాత్రి. ఈ దేవి నల్లటి దేహఛాయతో జుట్టు
విరియబోసుకొని పెడబొబ్బ నవ్వులతో రౌద్రరూపములో ఉంటుంది. ఈ దేవి చతుర్భుజాలను కలిగి
ఉండి, కుడివైపున అభయహస్తం, వరద ముద్రను, ఎడమవైపు ఖడ్గము, లోహకంటకాన్ని ధరించి
ఉంటుంది. కాళరాత్రి స్వరూపం చూడటానికి రౌద్రంగా ఉన్నప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే
ఇస్తుంది. అందుకే ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.దసరా మహోత్సవాలలో ఏడవనాడు కాళరాత్రిదేవిని పూజించాలని చెప్పబడింది. కాళరాత్రి దేవి దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. ఈ దేవిని కేవలం స్మరించనంత మాత్రమే భూత, ప్రేత, పిశాచాదులు భయపడి పారిపోతాయని, ఈ దేవిని ఆరాధించడం వలన భయాలనేవేవి ఉండవని,
సర్వదా సాధకుడు భయదూరుడవుతాడని భక్తుల విశ్వాసం.
:
ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు
గజవాహనసేవ నిర్వహించారు.
ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి,
గజవాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు జరిపారు.