శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం
షణ్ముఖశర్మ’ తొమ్మిది రోజుల ‘గణపతి గాథలు’ ప్రవచనాలలో భాగంగా మంగళవారం నాలుగో రోజు ప్రవచనాలు కొనసాగాయి.
ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన చేశారు.తరువాత ప్రవచనం జరిగింది.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ సామవేదం మాట్లాడుతూ గణపతిని నిర్మలమైన హృదయంతో ఆశ్రయించిన వారికి సుప్రసన్నుడవుతాడని, భక్తి అనేది ఒక్కటి దృఢంగా ఉంటే గణపతి అనుగ్రహం త్వరగా పొందవచ్చునని, గణపతి భక్తులలో ముద్గల, బృశండి అనే వారు గొప్ప భక్తులుగా ప్రసిద్ధి పొందారని పేర్కొన్నారు. విఘ్నాలను నివారించటానికే గణపతి ఆవిర్భవించినట్టు స్కందపురాణం చెబుతోందని, సమస్త విఘ్నాలను తొలగించేవాడు గణపతియేనని సకల పురాణాలు చెబుతున్నాయని అన్నారు.
గృత్సమతుడు అనే మహర్షి గణపతి మంత్రానికి మంత్రద్రష్టగా పేరుపొందాడని, వేద సంపన్నులు , ఋషులు, విజ్ఞానులు, జ్ఞానులు, సామాన్యులు, అతిసామాన్యులు ఇలా అందరిని అనుగ్రహించగల శక్తిస్వరూపుడు గణపతి అని పేర్కొన్నారు.ఇంకా తమ ప్రసంగంలో వివిధ క్షేత్రాలతో సంబంధమున్న గణపతిగాథలను, గణపతి క్షేత్రాల వైభవాన్ని, సనాతనధర్మం, వైదిక ఆచారాలకు సంబంధించిన పలు అంశాలను కూడా వివరించారు.