ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్మిన కూష్మాండదుర్గ అలంకారం
• దసరా మహోత్సవాలలో భాగంగా నాలగవ రోజైన నేడు (10.10.2021) అమ్మవారికి కూష్మాండదుర్గ అలంకారం,
• స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ
• ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,
• అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు
• రుద్రహోమం, చండీహోమం
• ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, , జపానుష్ఠానాలు
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన ఈ రోజు (10.10.2021) ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిగాయి.
శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిగాయి.
అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిగాయి.
ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు ప్రత్యేకం.
కుమారి పూజ దసరామహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారి పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజిస్తారు. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం
| కూష్మాండదుర్గ అలంకారం |
ఈ నవరాత్రి మహోత్సవాలలో నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని కూష్మాండ దుర్గ స్వరూపంలో అలంకరణ ప్రత్యేకం.
నవదుర్గలలో నాల్గవ రూపమైన ఈ దేవి ఎనిమిది భుజాలను కలిగి ఉంటుంది. అందుకే ఈమెను అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. సృష్టి లేకుండా ఈ జగత్తంతా చీకటిమయంగా ఉన్నప్పుడు, ఈ కుష్మాండదుర్గ బ్రహ్మండాన్ని సృష్టించింది. ఈ కారణంగా ఈమె సృష్టికి ఆది స్వరూపిణిగా కూడా కీర్తించబడుతోంది.
కుష్మాండదేవిని ఆరాధించడం వల్ల రోగాలన్నీ నివారించబడి, ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని కూడా చెప్పబడుతోంది.
కైలాస వాహనసేవ
ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు కైలాస వాహనసేవ మరో ప్రత్యేకం.
ఈ వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, కైలాసవాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు ప్రత్యేకం.
* D. Sambasiva Reddy, Guntur donated Rs. 1,00,116 For Annadanam scheme.
* Smt G.Rama Subbamma, Kurnool donated Rs.One Lakh For Annadanam scheme.
* A. Srinivas, Moulaali, Hyderabad, T.S. donated Rs.1,01,116/- For Gosamrakshana Nidhi.
కల్యాణ మూర్తులకు ఆభరణాల సమర్పణ:
శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణ మూర్తులకు ఈ రోజు (10.10.2021) బంగారు ఆభరణాలు, వెండి గిన్నెలు, వెండిపళ్లెం సమర్పించబడ్డాయి.నెల్లూరుకు చెందిన శ్రీమతి డి.వి. సరస్వతి,వారి వదినగారైన కీ.శే. బట్టారం సరస్వతి వారి పేరున ఈ ఆభరణాలను కార్యనిర్వహణాధికారి సమక్షములో అందజేశారు.
ఈ ఆభరణాలలో స్వామివారికి బంగారు బాసికం (13 గ్రాములు) నవరత్నాల బిళ్ళతో కూడిన 9 పొరల బంగారు యజ్ఞోపవీతం (89 గ్రాములు), అమ్మవారికి పగడం డాలరుతో కూడిన బంగారు గొలుసు (21గ్రాములు), కుమారస్వామివారికి ఎమ్రాల్డ్ గ్రీన్
డాలరు (28 గ్రాములు)తో కూడిన బంగారు గొలుసు, స్వామి అమ్మవార్లకు నవరత్నాలతో పొదిగిన బంగారు కంకణాలు(17 గ్రాములు) ఉన్నాయి.
వీటితో పాటు 300 గ్రాముల బరువుగల 4 వెండిగిన్నెలు, 850 గ్రాముల బరువుగల ఒక వెండి పళ్లెం కూడా అందించారు.
ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ శ్రీస్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణంలో వినియోగించేందుకు వీటిని సమర్పించినట్లుగా పేర్కొన్నారు.
అనంతరం దాతలకు వేదాశీర్వచనంతో స్వామిఅమ్మవార్ల ప్రసాదాలను అందించారు.
ఈ సమర్పణ కార్యక్రమములో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు బి.శ్రీనివాసులు, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు పి.మార్కండేయశాస్త్రి, వేదపండితులు గంటి రాధకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Post Comment