కూష్మాండదుర్గ అలంకారం-కైలాస వాహనసేవ
శ్రీశైల దేవస్థానం: దసరా మహోత్సవాలలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం
అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు,
పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్థానములు,
చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిపారు.అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు.అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన,చండీ హోమం జరిగాయి.
రాత్రి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు జరిగాయి.
కుమారీ పూజ:
దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ కుమారిపూజలో రెండుసంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను
పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించారు. . కుమారిపూజ నవరాత్రి
ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం.
కూష్మాండదుర్గ అలంకారం :
ఈ నవరాత్రి మహోత్సవాలలో నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి
ఉత్సవమూర్తిని కూష్మాండదుర్గ స్వరూపంలో అలంకరించారు.
నవదుర్గలలో నాల్గవ రూపమైన ఈ దేవి ఎనిమిది భుజాలను కలిగి ఉంటుంది. అందుకే
ఈమెను అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. సృష్టి లేకుండా ఈ జగత్తంతా చీకటిమయంగా
ఉన్నప్పుడు, ఈ కూష్మాండదుర్గ బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఈ కారణంగా ఈమె సృష్టికి ఆది
స్వరూపిణిగా కూడా కీర్తించబడుతోంది.కూష్మాండదేవిని ఆరాధించడం వల్ల రోగాలన్నీ నివారించబడి, ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని కూడా నమ్మకం.
ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు కైలాస
వాహనసేవ జరిగింది.ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి,
కైలాసవాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు చేసారు.
Post Comment