
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడో రోజు సోమవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు
జరిగాయి. యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు. ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.
హంస వాహన సేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు హంసవాహనసేవ ఘనంగా జరిగింది.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో హంస వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరిగింది. కోలాటం, చెక్కభజన, రాజ భటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, ఢమరుకం, చితడలు, శంఖం, పిల్లనగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ప్రదర్శించారు.
దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ:
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ వారు శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కె. రాంబాబు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి. భ్రమరాంబ, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేదపండితులు తదితర సిబ్బంది ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, దుర్గామల్లేశ్వర దేవస్థానం సిబ్బందికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాల సమర్పణ సంకల్పం పఠించారు. అనంతరం నూతన వస్త్రాలకు పూజాదికాలు జరిపారు.
ఆ తరువాత మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను, ఫలపుష్పాలను, అమ్మవారికి పసుపు, కుంకుమలు గాజులు, సమర్పించారు.ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరుపున ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు.జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారికి,మహాశక్తిస్వరూపిణి అయిన భ్రమరాంబాదేవివారికి బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలను సమర్పించే అవకాశం రావడం తమ పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాన్నారు. ఈ సందర్భం తమకెంతో ఆనందం కలిగిస్తోందన్నారు.