శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం
షణ్ముఖశర్మ’ తొమ్మిది రోజుల ‘గణపతి గాథలు’ ప్రవచనాలలో భాగంగా సోమవారం మూడో రోజు ప్రవచనాలు కొనసాగాయి.
ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. తరువాత బ్రహ్మశ్రీ సామవేదం ప్రవచనం చేశారు.
గణపతి ప్రసన్న స్వరూపుడని, త్వరగా అనుగ్రహిస్తాడు కనుక ఆ స్వామిని క్షిప్రప్రసాద గణపతి అంటారని, పరమేశ్వరుడికి త్రిపురాసుర సంహారం సమయంలో వచ్చిన విఘ్నాలను తీర్చి హేరంబ గణపతిగా పిలువబడ్డాడని పురాణాలు చెబుతున్నాయని బ్రహ్మశ్రీ సామవేదం అన్నారు.
గణేశ పురాణంలో గణపతికి దుర్వాయుగ్మ పూజ ఎంతో విశేషంగా ఉందని , కేవలం గణపతి నామాన్ని జపించినంతనే ఆయన అనుగ్రహిస్తాడని, ఈ నామ జపమే గణపతి ఆరాధనలో అత్యంత ముఖ్యమైన విధానమని ఆగమాలు, అనేక పురాణాలు పేర్కొన్నాయని బ్రహ్మశ్రీ సామవేదం అన్నారు.
గణపతి అవతారాలలో నర్తన గణపతి రూపం ఎంతో విశేషమైన అవతారమని, ఈ గణపతినే నృత్య గణపతిగా ఆరాధిస్తున్నామని, ఈ గణపతిని ఆనందదాయకుడిగా ముద్గల, గణేశ పురాణాలు వివరిస్తున్నాయని అన్నారు. శ్రీశైల సంబంధిత గణపతి గాథలను, క్షేత్ర వైభవాన్ని, సనాతనధర్మం, వైదిక ఆచారాలకు సంబంధించిన పలు అంశాలను కూడా వివరించారు.