హైదరాబాద్, జూలై 17: నిర్మల్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టిన ప్యాకేజీ 27, 28 పనులను అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని ఆయన చాంబర్ లో 27, 28 ప్యాకేజీ పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశానికి ఎస్సారెస్పీ సీఈ శంకర్, నిర్మల్ ఎస్ఈ మురళీధర్, ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సారెస్పీ ఈఈ రామరావు, కడెం ఈఈ వెంకటేశ్వర్ రావు, డీఈలు,ఇతర అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 27,28 ద్వారా నిర్మల్ జిల్లాలోని రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాకేజీ 27లో చేపట్టిన పనులను అక్టోబర్ లోగా పూర్తి చేసి 10 వేల ఎకరాలకు సాగు నీరును, అదే విధంగా ప్యాకేజీ 28 లో చేపట్టిన పనులను డిసెంబర్ లోగా పూర్తి చేసి 10 వేల ఎకరాలకు నీరందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 2019 జూన్ లోగా అన్ని పనులను పూర్తి చేసి మిగతా 80 వేల ఎకరాలను సాగు నీటీని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… ఇప్పటికే ప్యాకేజీ-27లో పలు గ్రామాల రైతులకు రూ.51 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. మిగతా రైతులకు సాధ్యమైనంత వేగంగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మెగా ( Mega engineering and infrastructures ltd) , సుశీ ఇన్ ఫ్రా ఎజెన్సీలకు సూచించారు. ప్యాకేజీ-27,28కు సంబంధించి ముథోల్ నియోజకవర్గంలో భూపరిహారంపై దృష్టి పెట్టాలన్నారు. .5 (పాయింట్ పైవ్ ) టీయంసీ నీళ్ళను గడ్డన్న ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరుకు వాడకుంటున్నారని, మిషన్ భగీరథకు వాడుకుంటున్న నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 28 ద్వారా గడ్డన్న ప్రాజెక్ట్ సాగు నీరుకు అందించాలని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలను రూపోందించాలని అధికారులను సూచించారు. కుంటాల మండలంలోని ఆరు గ్రామాలకు, తానూర్ గ్రామ రైతులకు భూపరిహారం త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విఠల్ రెడ్డి అధికారులను కోరారు.