శ్రీశైలదేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు
బుధవారం పంచ సహస్రవధాని డా. మేడసాని మోహన్ శివానందలహారి – భక్తితత్త్వంపై ప్రవచనాలు చేసారు.
జరిగింది. ముందు సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన చేసారు. డా. మేడసాని మాట్లాడుతూ జీవుడు సంసారసాగరాన్ని దాటేందుకు శంకరుల వారి శివానందలహరి ఎన్నో తరుణోపాయాలు తెలియజెప్పిందన్నారు.
పరమేశ్వరుడు కల్యాణస్వరూపుడన్నారు. ఆ స్వామి ఆనందస్వరూపుడని డా. మేడసాని అన్నారు. శివ అంటే క్షేమం, మోక్షం, శాంతం అనే అర్థాలున్నాయని అన్నారు. ఈ సృష్టిలో అణువణువునా పరమేశ్వరతత్త్వం వ్యాపించియుందన్నారు.మన మనస్సును శివునిపై లగ్నం చేయడమే ఒక యోగమన్నారు. భక్తులు అంచంచల భక్తితో శివుడిని ఆరాధించాలన్నారు.
విద్యలలో వేదము శ్రేష్టమైందని, వేదాలలో నమక చమకాలతో కూడిన రుద్రాధ్యాయము శ్రేష్టమని, రుద్రాధ్యాయములోని శివనామం ఎంతో శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు డా. మేడసాని. అందుకే అన్ని విద్యలకంటే కూడా శివనామం ఎంతో శ్రేష్టమైందన్నారు.భగవంతుడిని విశ్వసించి ఆరాధించేవాడిని భగవంతుడు వాత్సల్యంతో రక్షిస్తుంటాడన్నారు. మోక్షం పొందేందుకు తగిన జ్ఞానాన్ని పొందాలన్నారు. ఆ జ్ఞానం పరమశివుడి అనుగ్రహంతో లభిస్తుండని అన్నారు. అందుకే పరమేశ్వరుడు మోక్షకారకునిగా స్తుతించారన్నారు. క్షీరసాగరమథనంలోని అంతరార్థాలను వివరించారు. అదేవిధంగా యోగసాధనలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే విషయాలను కూడా వివరించారు.