శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (14.04.2020) సాయంకాలం గం.5.30ల నుండి శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలు జరిపింబడ్డాయి.
ప్రతీ మంగళవారం మరియు అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడబడ్డాయి.
బయలు వీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. పరమేశ్వరుని 25 లీలారూపాలలో ఒకరు. ఉగ్రరూపంలో దర్శనమిచ్చే ఈ స్వామి శరణు అని వచ్చిన భక్తులకు అభయప్రదుడై అనుగ్రహిస్తాడు.
అదేవిధంగా శ్రీశైల క్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్చాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట ముకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపులో కుడివైపున దక్షుడు, ఎడమవైపున భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ది..
ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్రపాలకుడు పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం మరియు అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయములో దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయి. అదేవిధంగా లాక్ డౌన్ కూడా అమలు చేయబడుతోంది. కాబట్టి అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఏకాంతంగా బయలువీరభద్రదస్వామికి విశేషార్చనలు జరిపించనున్నారు