ఖరీఫ్ దిగుబడులపై మార్కెట్ సంసిద్ధం కావాలి: మంత్రి హరీశ్ రావు
కోహెడ, పటాన్ చెరు మార్కెట్ లను అత్యాధునికంగా నిర్మించాలి
హైదరాబాద్ ఆగష్టు 22(ఎక్స్ ప్రెస్ న్యూస్); కోహెడ, పటన్ చెరు లలో తలపెట్టిన మార్కెట్ లను అత్యంత ఆధునికంగా జాతీయ స్ధాయి ప్రమాణాలతో నిర్మించాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.గడ్డి అన్నారం మార్కెట్ ను కోహెడ కు,మలక్ పెట్ మార్కెట్ ను పటన్ చెరు కు తరలిస్తున్ననేపద్యం లో మంగళవారం నాడిక్కడ బి ఆర్ కె భవన్ లో మార్కెటింగ్ శాఖ పనితీరును ఆయన సమీక్షించారు.పటన్ చెరు, కోహెడ మార్కెట్ ల నిర్మాణానికి సంబంధించి వీటితో ముడిపడిన అన్ని వర్గాలతో,బిల్డర్లు, బ్యాంకర్లు,ట్రేడర్లు,రైతులు.. అందరితోనూ విస్తృతంగా చర్చలు జరపాలని సూచించారు. ఆయా వర్గాలకు కావలసిన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ రెండు మార్కెట్ ల నిర్మాణం పై సమగ్ర నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగులో ఉన్న నిమ్మ, దొండ, బత్తాయి మార్కెట్ ల నిర్మాణాన్ని 45 రోజులలో పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. ఈ డెడ్ లైను లోపు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఈ -నామ్, కోల్డ్ స్టోరేజ్ లు, ఖరీఫ్ దిగుబడుల సేకరణకు మార్కెటింగ్ శాఖ సంసిద్ధత తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.రాష్ట్రంలో పెరుగుతున్న పత్తి సాగు నేపథ్యంలో ఖరీఫ్ లో రానున్న దిగుబడి సేకరణ పై తీసుకోవలసిన చర్యలపై మంత్రి హరీశ్ రావు సమీక్షించారు.ఈ సారి పత్తి దిగుబడి పెరిగే అంచనాలు ఉన్నదున వాటి కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్ యంత్రాంగం, సిద్ధంగా ఉండాలని మంత్రి అన్నారు.e-NAM కార్యకలాపాలను మంత్రి సమీక్షించారు. ఇప్పటికే తెలంగాణ లో 44 వ్యవసాయ మార్కెట్ లలో e. nam విజయవంతంగా అమలవుతున్నదని అయితే సాఫ్ట్ వేర్ సమస్యలు తరుచూ తలెత్తుతున్నందున ఆయా సమస్యలను వెంటనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లాలని మంత్రి ఆదేశించారు. నాబార్డు నిధులు సమీకరించి 9 కోల్డ్ స్టోరేజ్ ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని మార్కెటింగ్ మంత్రి ఆదేశించారు.రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో దడవాయి ల సంఘం ప్రతినిధులు మంత్రి ని కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు.వ్యవసాయ మార్కెట్ లలో దడవాయి ల లైసెన్సు బదిలీలో ఉన్న నిబంధనలలో కొన్ని సడలింపు లను ఇస్తూ పెండింగులో ఉన్న లైసెన్సు బదిలీ దరఖాస్తులను 15 రోజుల్లో క్లియర్ చేయాలని మార్కెటింగ్ మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో దడవాయి ల సౌకర్యాలపై అధ్యయనం చేయాలని మార్కెటింగ్ అధికారులను హరీశ్ రావు సూచించారు.మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి,జె.డి.లు లక్ష్మణుడు, పి . రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్ మల్లేశం, ఓ.ఎస్.డి .జనార్దన్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.