
హైదరాబాద్, డిసెంబర్ 12 :: త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందిగా, ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
మంగళవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యా శాఖ పై సి.ఎం. సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యా శాఖా కార్యదర్శి వాకాటి కరుణ, సి.ఎం .ఓ కార్యదర్శి శేషాద్రి, విద్యా శాఖా కమిషనర్ దేవసేన లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందచేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదికతోపాటు, రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి వాటికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని స్పష్టం చేశారు.
టి.ఎస్.పి.ఎస్.పి ప్రక్షాళనకు సి.ఎం. ఆదేశం:
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సి.ఎం. కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీ గుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీ.ఎస్.పబ్లిక్ సర్వీస్ కమి షన్ కార్యదర్శి అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీ.కె.శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. టీ.ఎస్.పీ.ఎస్.సి చైర్మన్, సభ్యుల నియామకాలకు సుప్రీమ్ కోర్ట్ జారీ చేసిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగు మార్గ దర్శకాలను రూపొందించాలని సి.ఎం ఆదేశించారు. తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా మూసి పరీవాహకం – సి.ఎం. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మహానగరంలో మూసి నది ప్రారంభమయ్యే ప్రాంతం నుండి చివరి వరకు మూసి నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.
డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ, శాసన సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్, సి.ఎం.ఓ అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షానవాజ్ ఖాసీం, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మొత్తం మూసీ పరీ వాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా స్వీయ ఆర్థిక చోదక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందుకుగాను, మూసీ నదీ వెంట బ్రిడ్జిలు, కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్ మెంట్ పార్కులు, హాకర్ జోన్ లు, పాత్-వేలను ప్రభుత్వ, ప్రయివేటు పార్ట్నర్ షిప్ విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసి నదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. మూసీలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు తగు నీటి మట్టం ఉండేలా చెక్ డ్యాంలు నిర్మించాలన్నారు.