పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో శ్రీ సాక్షిగణపతి స్వామికి విశేష అభిషేకం
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో లోక కల్యాణం కోసం పౌర్ణమిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (09.03.2020) ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది.
కాగా ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు మరియు పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి.
ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించబడ్డాయి. ఇందులో భాగంగానే విశేషంగా గణపతి హోమం కూడా జరిపించారు.
వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని చెప్పబడుతోంది. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని చెప్పబడుతోంది.
కాగా శ్రీశైలక్షేత్ర పరివార ఆలయాలలో సాక్షిగణపతి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి.
అందుకే ఈ స్వామి సాక్షిగణపతిగా పేరొందాడు. చక్కని నల్లరాతితో మలచబడిన ఈ స్వామి ఒక చేతిలో కలం, మరో చేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.