సచివాలయం: జీఎన్‌రావు కమిటీ రిపోర్టు అందించింది. బోస్టన్ గ్రూప్ (బీసీజీ) సంస్థ నివేదిక రావాల్సి ఉంది. ఈ రెండు రిపోర్టులపై నిపుణులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ఒక హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తాం. హైపవర్ కమిటీ సూచనల మేరకు రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రజా సంక్షేమం, విద్యార్థులు, రైతులు, శుద్ధ జలాలు, ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలకు ఇప్పటికే రూ. వేల కోట్లు వెచ్చిస్తున్నామని, ఇవి పక్కనబెట్టి రాజధానిపై ఖర్చు చేస్తే హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ లాంటి ప్రాంతాలతో ఎప్పటికి పోటీపడే పరిస్థితి వస్తుందని నేడు మంత్రిమండలిలో చర్చించామని తెలిపారు. 2014 డిసెంబర్ 30 న రాజధాని ప్రకటనకు ముందు పలువురు బినామీలు, కారు డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే వారిపై భూములు కొనుగోలు చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేసేందుకు న్యాయనిపుణుల సలహా తీసుకుంటామన్నారు. లోకాయుక్తాకు ఇవ్వడమా.. సీబీఐ లేదా సీబీ సీఐడీ కి ఇవ్వడమా అనేది న్యాయ నిపుణుల సలహా మేరకు విచారణ చేస్తాం. కేబినెట్ భేటీ అనంతరం రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
1. జరగబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల కొరకు 2011 జనాభా గణన ఆధారంగా ఎస్టీ రిజర్వేషన్ 6.77 శాతంగానూ, ఎస్సీ రిజర్వేషన్ 19.08 శాతంగా, వెనుకబడిన కులాల కోసం 34 శాతం జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఏపీ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది.
2. ప్రాణాలు కాపాడేందుకు 412 కొత్త 108 వాహనాలు 2020 మార్చి 31 లోపు కొనుగోలు చేయడం కోసం రూ.71.48 లక్షలు కేటాయిస్తూ కొనుగోలుకు అనుమతి మంజూరు చేస్తూ తీర్మానించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించే 104 నూతన వాహనాల కోసం రూ.60.51 లక్షలతో 656 వాహనాలు 2020 మార్చి 31 లోపు కొనుగోలు చేసేందుకు తీర్మానించారు.
3. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కొత్త విధానాన్ని ఆమోదించారు. కనీస మద్దతు ధరకు నోచుకొని పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాలకు మద్దతు ధర ప్రతి సంవత్సరం ముందే ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి మంత్రిమండలి తీర్మానించింది.
4. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వ సంస్థకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో సర్వే నంబర్ 377/3లో 6 ఎకరాల 4 సెంట్లను రూ.43 లక్షల మార్కెట్ వాల్యూ ఉన్నప్పటికీ ఎకరా రూ. లక్ష చొప్పున కేటాయిస్తూ తీర్మానించారు.
5. వైయస్ఆర్ కడప జిల్లా రాయచోటి గ్రామంలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు కేటాయిస్తూ తీర్మానించారు .
6. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రైట్స్ నిర్మాణ సంస్థకు బాధ్యతలను అప్పగిస్తూ ఇన్క్యాప్స్ సీఎండీ తీసుకున్న నిర్ణయాన్ని ర్యాటిఫై చేస్తూ తీర్మానం చేసారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడం కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు కూడా ఇన్క్యాప్స్ సీఎండీకి అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానించారు.
7. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం పోర్టు సముద్ర ముఖ పరిధిని కుదిస్తూ తీర్మానం చేసారు.
2014 డిసెంబర్ 30న అంటే రాజధాని ప్రకటన కంటే ముందు ఎవరెవరు భూములు కొనుగోలు చేశారో మంత్రిమండలి ఉప సంఘం పరిశీలించింది.
సమగ్ర రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ రిపోర్టును మంత్రిమండలికి అందింది . కమిటీలో జీఎన్‌రావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, వారితో పాటుగా అర్బన్ డెవలప్మెంట్లో, మాస్టర్ ప్లాన్ తయారు, నగరాలను రూపొందించడంలో నిపుణులను కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేసుకొని అధ్యయనం చేయడం జరిగింది. బోస్టన్ గ్రూపు కమిటీ రిపోర్టు ఇంకా ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఆ రెండు రిపోర్టులను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా హైపవర్ కమిటీ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాన్ని మంత్రిమండలి నిర్ణయించింది.