2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామి పథకం లను అనుసంధానించే విషయమై పాలసీని రూపొందించడానికి హైదరాబాద్ లో రేపు ఒక రోజు వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్ధసారధి తెలిపారు.
మంగళవారం ఈ వర్క్ షాప్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రటరి అమర్ జిత్ సింగ్ లు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ప్రాంతీయ సదస్సులో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు., తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పాండిచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ప్రాంతాల వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో పాటు నీతి ఆయోగ్ అధికారులు పాల్గొంటారని అన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ముఖ్యమంత్రుల కమిటి ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవడంలో భాగంగా ఈ సదస్సును హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి తెలిపారు.