సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ శివారులో రోడ్డు ప్రమాదానికి గురై 8 మంది కుటుంబ సభ్యులతో పాటు జిన్నారం నవతెలంగాణ విలేకరి లక్ష్మణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం పై టీయుడబ్ల్యుజె రాష్ట్ర బాధ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేసారు . లక్ష్మణ్ భార్య పుష్ప, కూతురు, మరి కొందరు తీవ్ర గాయాలకు గురై సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స విభాగంలో చేరిన సమాచారాన్ని అందుకొని టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు రాజేష్, హెచ్ యూ జె కార్యదర్శి శంకర్ గౌడ్ , నార్త్ జోన్ డిసిపి సుమతితో కలిసి హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు . ఆసుపత్రి వైద్యాధికారి వసంత్ ను కలిసి క్షతగాత్రుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. విరాహత్ అలీ మాట్లాడుతూ , మృతుడు లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా తమ సంఘం అండగా ఉంటుందన్నారు.