శ్రీశైల దేవస్థానం:ఈ రోజు 24న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.2,06,45,355/- లు నగదు రాబడిగా లభించింది.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 26 రోజులలో సమర్పించారు. పై నగదుతో పాటు 301 గ్రాముల బంగారు, 4 కేజీల 250 గ్రాముల వెండి లభించాయి. 67యు ఎస్ ఏ డాలర్లు, 60 కెనడా డాలర్లు, 10 ఎస్.ఏ.యు రియాల్స్, 5 యూఏఈ డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిపారు.
దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం |
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించారు.
ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు.
ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని,జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.
కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపి, అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, సుబ్రహ్మణ్య అష్టోత్తరము చేసిన అనంతరం సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేశారు.
సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనే,నెయ్యి, కొబ్బరినీళ్లు మరియు వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి. అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ కుమారస్వామికి విశేషార్చనలు జరిపించారు.
నందీశ్వరస్వామికి విశేషపూజ |
లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపారు.
ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం నిర్వహిస్తున్నారు. ప్రదోషకాలంలో సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజజరిపారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షాదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిపారు.
పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో ఈ విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేసారు. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన చేసారు.
బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం:
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలు జరిపింది.
ప్రతీ మంగళవారం, , అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహిస్తారు.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం జరిపారు.
*Swatma Nandendra Saraswathi Maha Swamy, Visakha Saradha Peetam visited Bayaluveerabhadra Swami. E.O. and other officials , Archaka swaamulu participated in this event.