హరితహారాన్ని పకడ్బందీగా అమలు చేయాలి …
సమీక్షా సమావేశంలో హోం మరియు కార్మిక శాఖా మంత్రి నాయిని నరసింహారెడ్డి
హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఆయా శాఖల ఉన్నతాదికారులు కృషి చేయాలని రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని బుదవారం నాడు జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తెలంగాణ ఏర్పాటు కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి తెలంగాణ సాదించిన నాటి నుండి ముఖ్యమంత్రి తెలంగాణ అబివృద్ది కొరకు ఎంతగానో కృషి చేస్తున్నారని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, అందులో బాగంగా హరితహారం కార్యక్రమం భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కేవలం ఆర్దికంగా , పారిశ్రామికంగా అబివృద్ది చెందటమే కాకుండా ఇక్కడి ప్రజలు మంచి వాతావరణంలో జీవించాలని, వర్షాలు బాగా పడి రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో “తెలంగాణకు హరితహారం“ అనే ఒక మంచి కార్యక్రమం చేపట్టారని తెలియజేశారు.అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పోరేట్, ఇతర ప్రైవేటు సంస్థలు, ప్రజలు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారని గుర్తు చేశారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడుకున్నప్పుడే మనకు వాటి ఫలితాలు అందుతాయని, పర్యావరణ సమస్యలు, రోగాలు తగ్గుతాయని, మంచి వర్షాలు, చక్కటి గాలి లబిస్తుందని పేర్కొన్నారు. ఈ రోజు పోలీస్ మరియు కార్మిక శాఖ లలో ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని కాపాడుకున్నారు, వాటి రక్షణకు తీసుకుంటున్న చర్యలు గురించి అయన అదికారులను అడిగి తెలుసుకున్నారు. పొలీసు, ఫైర్, జైళ్ళ, సైనిక సంక్షేమం శాఖలతో పాటు, కార్మిక, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, బాయిలర్ డిపార్టుమెంటులలో హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని, మున్ముందు ఈ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించేందుకు ప్రణాలికలు సిద్దం చేసుకోవాల్సి ఉందన్నారు. వర్షాలు కూడా బాగా పడటంతో ఇది సాద్యమయిందని, ఇది మంచి పరిణామమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మొక్కలు నాటడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించడంతో బాటు, మొక్కలను సంరక్షణకు ఎవరైతే తగిన చర్యలు తీసుకుంటారో వారికి ప్రభుత్వం తరుపున గుర్తింపు ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ హరితహారం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పోరేట్ శాఖలు,ప్రజలు, విద్యార్థులు మరింత ఉత్సాహంగా పాల్గొని బంగారు తెలంగాణతో బాటు , హరిత తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని మంత్రి కోరారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కమీషనర్ అహ్మద్ నదీం , ఉపాది మరియు శిక్షణ శాఖ సంచాలకులు కె.వై.నాయక్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, జైళ్ళ శాఖ డి.జి. వి.కె.సింగ్, అడిషనల్ డి.జి.పి. అంజనీ కుమార్, అగ్నిమాపక శాఖ డి.జి. రాజీవ్ రతన్, సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు రమేష్ కుమార్ తదితర అధికారులు సమావేశం లో పాల్గొన్నారు.