శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్ర పరిధిలో కరోనా నివారణ చర్యలపై కార్యనిర్వహణాధికారి ఈ రోజు 21 న దేవస్థాన అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులతో దూరశ్రవణ సమావేశం (టెలికాన్ఫరెన్స్) ద్వారా సమీక్షించారు.ఈ టెలీకాన్ఫరెన్స్ లో స్థానిక తహశీల్దార్ రాజేంద్రసింగ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా. సోమశేఖర్, దేవస్థాన వైద్యులు పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వైద్యచికిత్సలు అందించాలని అన్నారు. వీరి వైద్యచికిత్సలకుగాను దేవస్థానం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని చెప్పారు.కరోనా నిర్ధారణ అయినవారి ఇళ్ళపరిసరాలను పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేస్తుండాలని దేవస్థాన పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.ఎవరికైనా ఇబ్బందికలిగినప్పుడు వెంటనే దేవస్థాన అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా. సోమశేఖర్ మాట్లాడుతూ తగిన జాగ్రత్తలను పాటించడం ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేయగలమని, అందుకే స్థానికులందరూ కూడా స్వీయనియత్రణను పాటిస్తూ, కరోనా నివారణలో ప్రభుత్వ శాఖలకు, దేవస్థానానికి సహకరించాలని కోరారు.అందరూ ఆహారములో పప్పుదినుసులు,, తాజాకూరగాయలు, పండ్లు వంటి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. దీనివలన రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు. వంటకాలలో అల్లం, నిమ్మకాయలు మొదలైనవాటిని వినియోగిస్తుండాలని సూచించారు.