శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్ర పరిధిలో పలువురికి కరోనా నిర్ధారణ అయింది. ఈ రోజు 14 న ఇద్దరు ఆలయ పరిచారకులు, ముగ్గురు భద్రతా సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా పలువురు స్థానికులు కూడా ఉన్నారు.క్షేత్ర పరిధిలో కరోనా నివారణ చర్యలపై ఈ సాయంకాలం కార్యనిర్వహణాధికారి దేవస్థాన అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులతో దూరశ్రవణ సమావేశం ( టెలికాన్ఫరెన్స్ ) నిర్వహించి పలు సూచనలు చేశారు.ఈ టెలికాన్ఫరెన్స్ లో తహశీల్దార్ రాజేంద్రసింగ్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా. సోమశేఖర్, దేవస్థాన పారిశుద్ధ్య, వైద్యవిభాగాల సిబ్బంది కూడా పాల్గొన్నారు.కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎక్కడ కూడా రాజీపడకుండా అన్ని చర్యలను సమర్థవంతంగా కొనసాగించాలన్నారు. ఇప్పటికే కరోనా నిర్ధారణ జరిగి హోంక్వారంటైన్లో ఉన్నవారి ఆరోగ్యంపట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు.రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ వారి సహకారముతో ఏరోజుకారోజు హోంక్వారంటైన్ లో ఉన్నవారి ఆరోగ్యపరిస్థితిని, వారి బాగోగులను పరిశీలిస్తుండాలని వసతి – పారిశుద్ధ్య విభాగాల సహాయ కార్యనిర్వహణాధికారిని, ముఖ్యభద్రతాధికారిని ఆదేశించారు. హోంక్వారంటైన్ లో ఉన్నవారు ఎట్టిపరిస్థితులలో కూడా ఇంటి నుంచి వెలుపలికి రాకూడదని, వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ ద్వారా దేవస్థానం అధికారులను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ముఖ్యంగా అత్యవసర విధులలో ఉన్నవారు ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.కాగా కరోనా నిర్ధారణ అయినవారి ఇళ్ల పరిసర వీధులన్నింటిని గుర్తించి శానిటైజేషన్ చేయడం, బ్యారికేడింగ్ చేసారు. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు పొందుతూ ఈ ప్రాంతాలలో పూర్తి శాస్త్రీయ పద్ధతిలో శానిటైజేషన్ కొనసాగిస్తుండాలన్నారు.సాధ్యమైనంత వరకు స్థానికులందరు కూడా ఇళ్ళకే పరిమితం కావాలని, తప్పనిసరి పరిస్థితులలో నిర్దేశించిన సమయాలలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ముఖ్యంగా వయస్సు పైబడిన వారు, చిన్నపిల్లలు ఇంటిపట్టునే ఉండాలని సూచించారు.ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ముఖానికి మాస్కు ధరిచండం, భౌతికదూరాన్ని పాటించడం, సబ్బు లేదా శానిటైజర్ లో ప్రతి 2 గంటలకు ఒకసారి 20 నుండి 40 సెకన్ల పాటు చేతులను శుభ్రపరుచుకోవడం లాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు.పరిమిత సమయాలలో మాత్రమే పాలు,కూరగాయలు మొదలైన అత్యవసరాల వస్తువుల కొనుగోలు చేయాలని స్థానికులకు సూచించారు.రహదారులలోనూ, ఆరుబయలు ప్రదేశాలలోనూ జనులు గుంపులుగా గుమికూడకుండా జాగ్రతలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఈ విషయమై మరిన్ని ప్రత్యేక చర్యలను తీసుకోవాలని దేవస్థానం భద్రతా అధికారిని ఆదేశించారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల గురించి దేవస్థాన ప్రసారవ్యవస్థ ద్వారా విస్తృతంగా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందజేయడం జరుగుతూ ఉంటుందని, స్థానికులందరు కూడా వీటిని గమనించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.ఎవరు కూడా అపోహాలకు లోనుకాకూడదని, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు.అందరూ స్వీయనియంత్రణను పాటించడం ఎంతైనా అవసరమన్నారు.