జర్నలిస్టు సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చల్లో, సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ లోకేశ్వర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరేంత వరకు స్టూడియో ఎన్ ఉద్యోగులకు తమ సంఘం అండగా ఉంటుందని టీయుడబ్ల్యుజె(ఐజేయు అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ స్పష్టం చేశారు. సీయిఓ తీరును నిరసిస్తూ గత రెండు రోజులుగా కార్యాలయం ఆవరణలో బాధిత ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు టీయుడబ్ల్యుజె సంపూర్ణ మద్దతును ప్రకటించింది. సోమవారం కార్యాలయాన్ని సందర్శించిన ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీకి పలువురు ఉద్యోగులు తమ గోడును వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 6 నుండి 10 వరకు దాదాపు 150 మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి, సమ్మెకు పూనుకోగా ఎండి లోకేశ్వర్ ఇచ్చిన హామీతో వారు సమ్మెను విరమించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే సీయిఓ సమ్మెకు నాయకత్వం వహించారనే నేపంతో దాదాపు 30 మంది ఉద్యోగులపై పై కక్ష్య గట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. లిఖిత పూర్వకంగా జరిగిన ఒప్పందం లో ఉద్యోగులపై కక్ష్య సాధింపు చర్యలు ఉండవని ఎండి పేర్కొన్నప్పటికీ, సీయిఓ మాత్రం ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తే తమ సంఘం న్యాయ పోరాటానికి దిగక తప్పదని యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు.