అమరావతి: ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. కొత్త ఇసుక విధానం రూపకల్పనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న రేట్ల కన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.అవినీతి లేకుండా. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పర్యావరణాన్ని పరిరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని తెలిపారు. ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్ యార్డులు,నగరాలు,పట్టణాల్లో అదనపు స్టాక్ యార్డులు ఏర్పాటుకు ఆదేశించారు. ఇసుక రీచ్ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదు, స్టాక్ యార్డు నుంచి వినియోగదారుడికి చేరేంత వరుకు మరొక రశీదు ఇవ్వాలని తెలిపారు.
ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు, వేబ్రిడ్జిల ద్వారా లెక్కింపుకు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక తవ్వకాలు,తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు,అక్రమ రవాణదారులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఏపీఎండీసీ ద్వారా యాప్,వెబ్‌పోర్టల్‌ను రూపొందించాలని తెలిపారు. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంత వరుకు ఇసుక అందించే బాధ్యతను కలెక్టర్లు కొనసాగిస్తారని వెల్లడించారు.కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో మత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్,మేకతోటి సుచరిత,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్,ఉన్నతాధికారులు అజేయ్ కల్లం,రవిశంకర్ అయ్యన్నార్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి
గ్రామ సచివాలయాలను అక్టోబర్ 2న ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రతి రెండు వేల మందికి గ్రామ సచివాలయం ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయంలో ఉద్యోగాల నియామాకానికి ఈ నెల జూలై 15 నాటికి నోటిఫికేషన్ జారీ చేయాలని, జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) ద్వారా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అత్యంత పారదర్శక విధానంలో, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల్లో కల్పించే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలన్న విషయం యువతకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.
గ్రామంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా మరో పది మందికి ఈ ఉద్యోగాలు ఇస్తున్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ అర్హతలున్న వారిని పరిగణలోకి తీసుకోవాలని, వారంతా తమకు నిర్ణయించిన ఏ పనైనా చేయగలిగేలా తీర్చిదిద్దాలన్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని, అందుకోసం డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా చేపట్టాలని తెలిపారు. ఒక జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాబోయే ముప్పై ఏళ్లు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్పొరేషన్ ప్రణాళికలు రచించుకుని అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉందని వెల్లడించారు.
జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులు నియామకం
రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
శ్రీకాకుళం జిల్లా – వెల్లంపల్లి శ్రీనివాస్,
విజయనగరం–చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
విశాఖ జిల్లా –మోపిదేవి వెంకటరమణ
తూర్పుగోదావరి–ఆళ్ల నాని
పశ్చిమగోదావరి–పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణా జిల్లా–కురసాల కన్నబాబు
గుంటూరు జిల్లా–పేర్ని నాని
ప్రకాశం జిల్లా– అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు జిల్లా– మేకతోటి సుచరిత
కర్నూలు జిల్లా– బొత్స సత్యనారాయణ
వైయస్ఆర్ జిల్లా– బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
అనంతపురం జిల్లా– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు జిల్లా– మేకపాటి గౌతంరెడ్డి