రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆనందోత్సాహల మధ్య కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. భగవంతుడి దయవలన కొత్త పరిపాలనా విభాగాలన్నీ విజయవంతమై ప్రజలకు మరింత మేలు చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సిద్దిపేటకు చెందిన మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి కేసిఆర్ ను, కొత్త జిల్లాలను ఆశీర్వదించారు. అక్కడి నుండి సిద్దిపేట బస్టాండు వరకు ముఖ్యమంత్రి ర్యాలి నిర్వహించారు. దారి పొడవునా ప్రజలు సిఎం కు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంటిపైనుండి గులాబి పూల వర్షం కురిపించారు. దారి పొడవునా కళాకారుల ఆట పాటలు, వివిధ కులవృత్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
సిద్దిపేట పట్టణమంతా టపాసుల మోతతో మారు మోగింది. పట్టణంలోని ప్రతి ఇంటిలో మహిళలు సిద్దిపేట జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేసి సిఎం కు మంగళ హారతులు పట్టారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ఆర్టీసి కార్మికులు, మైనారిటీలు, ఆర్య వైశ్య సంఘం నాయకులు, క్రెస్తవ సంఘాల ప్రతినిధులు, అర్చకులు, అన్నీ వర్గాలు దారిపోడవునా బారులు తీరి సిఎం కు స్వాగతం పలికారు. బస్సులో ప్రయాణిస్తున్న సిఎం కేసిఆర్ తనకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభివాదం చేస్తూ వారితో వున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా వున్నప్పుడు తనతో పాటుగా పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ఎదురుపడినప్పుడు వారి గురించి మంత్రి హరీష్ రావును అడిగి తెలుసుకున్నారు.
నేనుప్పుడు ఆయన సర్పంచుగా వుండేది, ఈయన ఎంపిటీసిగా వుండేది, మరొకతను కౌన్సిలర్ గా వుండేది అని చెబుతూ వారంతా ఇప్పుడేం చేస్తున్నారని మంత్రిని అడిగారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నిర్వహిస్తున్న పదవుల గురించి హరీష్ రావు కేసిఆర్ కు చెప్పారు. సభావేదిక వద్దకు వెళ్లిన తరువాత ఉద్యోగ సంఘాల నాయకులు దేవిప్రసాద్, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి తదితరులను ఆప్యాయంగా పలుకరించారు. తన గురువులు, కుటుంబ పెద్దలకు ముఖ్యమంత్రి పాదాభివందనం చేశారు.