తెలంగాణలో అత్యంత కరువు పరిస్థితి ఉన్న మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల రైతులకు సాగు నీరు అందించడం అత్యంత అవసరమని, పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి, క్యాంపు కార్యాలయంలో మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, డా. లక్ష్మా రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆలం వెంకటేశ్వర రెడ్డి, జీవన్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఈ.ఎన్.సి. మురళీధర్ తదితరులతో సమావేశమయ్యారు.
పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు పట్ల ముఖ్యమంత్రి, మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచు అర్థంపర్థం లేని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ భంగపడుతున్నదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. సుప్రీంకోర్టు తాజా స్పందనతోనైనా ఏపీ ప్రభుత్వం వైఖరి మారాలని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు తీర్పు పాలమూరు, నల్లగొండ జిల్లాల ప్రజలకు గొప్ప ఊరట అని సిఎం అన్నారు. ఈ నేపథ్యంలో రాకెట్ వేగంతో పాలమూరు, డిండి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రితో పాటు ఆయా జిల్లాల మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ వేగంగా స్పందించాలని, ఏ చిన్న సమస్య తలెత్తినా రంగంలోకి దిగి పరిష్కరించాలని సిఎం సూచించారు.
సాగు నీటి విషయంలో తీవ్ర వివక్షకు గురైన మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో ఎంతో దుఖం ఉన్నదని, ఆ గోస తీర్చడానికి ప్రజా ప్రతినిధులు ఎంతో చొరవ ప్రదర్శించాలని చెప్పారు. పాలమూరు జిల్లాలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి గురువారం ప్రారంభోత్సవాలు కూడా జరపుతుండడం పట్ల సిఎం సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే వేగంతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు.