జర్నలిస్టులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ, మే 28న టీయుడబ్ల్యుజె జరపతలపెట్టిన “జర్నలిస్టుల గర్జన” సభకు భారీగా తరలిరావాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ పిలునిచ్చారు. జర్నలిస్టుల గర్జన సభ సన్నాహాల్లో భాగంగా శుక్రవారం పటాన్ చెరువు మండలం, ఇస్నా పూర్ లో జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా కార్యవర్గం, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విరాహత్ అలీ హాజరై ప్రసంగించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగాలను, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన జర్నలిస్టుల సంక్షేమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించడం విచారకరమన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇండ్ల మాటే లేదని, ఆరోగ్య పథకం ప్రశ్నార్థకంగా ఉందని విరాహత్ ఆందోళన వ్యక్తం చేశారు. . 28న జరిగే సభకు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్, మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కె.రంగాచారి, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం కన్వీనర్ దుర్గా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.